జాతీయస్థాయి సాహితీ వేదికపై తెలుగు తేజం
మహబూబాబాద్ రూరల్/మహబూబాబాద్ అర్బన్ : అక్షరమే ఆయుధంగా మలుచుకుని, సామాజిక అంశమే ఇతివృత్తంగా జాతీయ స్థాయిలో సత్తాచాటాడు జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు యువ రచయిత కానుకుర్తి సాయికిరణ్. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం యువ 3.0 పథకంలో దేశవ్యాప్తంగా ఎంపికై న 43 మంది ప్రతిభావంతులలో ఒకరిగా నిలిచి, తెలుగు సాహితీ కీర్తిని ఢిల్లీ వేదికపై చాటిచెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన యువ పథకం దేశంలోని 30 ఏళ్ల లోపు యువ రచయితలను ప్రోత్సహించే ఒక గొప్ప వేదిక కాగా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన మూడో విడత పోటీలో వేలాది మంది పోటీపడ్డారు. వారిలో నుంచి తుది జాబితాలో 43 మంది మాత్రమే స్థానం సంపాదించుకోగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికై న ఇద్దరిలో సాయికిరణ్ ఒకరు కావడం గమనార్హం. సాయికిరణ్ సాధించిన ఈ విజయం తెలుగు రాష్ట్రాలు, మాతృభాషకు గర్వకారణమని సాహితీ మిత్రులు, ప్రముఖులు అతడికి అభినందనలు తెలిపారు.


