గార్లలో బంద్ ప్రశాంతం
● జలదోపిడీని నిరసిస్తూ బంద్‌కు
పిలుపునిచ్చిన అఖిలపక్షం
గార్ల: మున్నేరు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ నిర్మించి జలదోపిడీకి పాల్పడుతున్న పాలకుల తీరును నిరసిస్తూ ఆదివారం గార్లలో మున్నేరు జలసాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మున్నే రు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మ ణ్‌నాయక్ మాట్లాడారు. గార్ల మండలం దుబ్బగూడెం సమీపంలోని మున్నేరు ఏటి నుంచి పాలేరుకు నీటిని తరలించే ప్రభుత్వ జీఓ నంబర్ 98ను వెంటనే రద్దు చేసి, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి ఈ ప్రాంత రైతులకు చుక్కనీరు అందించకుండా, మున్నేరు లింక్ కెనాల్ ద్వారా తన సొంత నియోజకవర్గం పాలేరుకు నీళ్లు తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే ప్రాణాలను అడ్డుపెట్టి అయినా పనులను అడ్డుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జలసాధన కమిటీ కో కన్వీనర్లు కందునూరి శ్రీనివాస్, జడ సత్యనారాయణ, జంపాల విశ్వ, సక్రు, శీలంశెట్టి రమేష్, కత్తి సత్యం, మురళి, రాధాకృష్ణ, పెద్దవెంకటేశ్వర్లు, ఇర్రి రవి, రాము, అజ్మీరా వెంకన్న, మీగడ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కెనాల్ పనులు నిలిపివేయాలి
బయ్యారం: జిల్లా రైతులకు అన్యాయం చేస్తూ పాలేరు ప్రాంత రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనుల ప్రారంభాన్ని నిలిపివేయాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఆదివారం బయ్యారంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు గౌని ఐలయ్య, మండా రాజన్న, జగ్గన్న మాట్లాడారు. బయ్యారం, గార్ల, డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి మండలాల రైతులకు సాగునీటిని అందించాల్సిన మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం దుర్మార్గమన్నారు. అనంతరం లింక్ కెనాల్ నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 98 ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం, నాయకులు వీరభద్రం, యుగంధర్, సంగయ్య, ఐలయ్య, మంగీలాల్, శేషు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


