
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
● ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
గార్ల: గ్రామాల్లో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండలంలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను నివారించేందుకు గ్రామాల్లో ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. విషజ్వరాలతో బాధపడే వారికి వైద్యసేవలు అందించాలని సూచించారు. ఇప్పటి వరకు మండలంలో ఎన్ని డెంగీ కేసులు నమోదయ్యాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి గుంటలు, ప్లాస్టిక్ డబ్బాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని వైద్య సిబ్బంది ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది మండల కేంద్రాల్లో నివాసం ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, డాక్టర్లు రాజ్‌కుమార్ జాదవ్, శివకుమార్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.