
నమిలిగొండలో విషాదఛాయలు
స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్‌లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్‌కుమార్(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్‌కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమ్మాయి సాఫ్ట్‌వేర్..
అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
నమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్‌కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వినయ్‌కుమార్ జనగామ పిన్‌కేర్ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గ్రామంలో విషాదఛాయలు
భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్‌లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్‌కుమార్‌ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు.
గ్రామానికి చెందిన ప్రేమజంట భువనగిరిలో ఆత్మహత్య
రోదిస్తున్న శృతి తల్లి, కుటుంబ సభ్యులు

నమిలిగొండలో విషాదఛాయలు