
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
మరిపెడ: మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భూక్య రవిరాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఫార్మసీస్టోర్, వ్యాక్సినేషన్ రూమ్, అటెండెన్స్ రిజిస్టర్, అవుట్ షేషెంట్, ఇన్ పేషెంట్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ఎవరైనా వడదెబ్బ తగిలి ఆస్పత్రికి వస్తే వెంటనే ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. వడదెబ్బపై ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మందుల కొరత లేకుండా చూడాలని అన్నారు.
‘ఓపెన్’ పరీక్షలు ప్రారంభం
మహబూబాబాద్ అర్బన్: ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఆదివారం ప్రారంభమైనట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపా రు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌లో 422 మందికి 372 మంది విద్యార్థులు హాజరయ్యారని, పదిలో 558 మందికి 493 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారాన్నారు. ఎక్కడ ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు.
తహసీల్దార్ల బదిలీ
కురవి/గార్ల/దంతాలపల్లి: జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీరోలు తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆర్.శారద గార్లకు బదిలీ అయ్యారు. సీరోలుకు తహసీల్దార్ ఎస్‌వీ నారాయణమూర్తి రానున్నారు. అలాగే కురవి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న యు.సునీల్‌కుమార్‌ను దంతాలపల్లికి బదిలీ చేశారు. కురవికి గూడూరు తహసీల్దార్ ఎస్.శ్వేత బదిలీపై రానున్నారు. దంతాలపల్లి తహసీల్దార్ రాజేశ్వర్‌ను గూడూరుకు బదిలీ చేశారు.
నేటి నుంచి రిఫ్రెషర్ కోర్సు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ప్రభుత్వ పాలనాశాస్త్రం, మానవ వనరుల నిర్వహణ శాస్త్ర విభాగంలోని పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై ఈనెల 21 నుంచి రిఫ్రెషర్ కోర్సు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు చేపట్టే ఈ తరగతుల్లో విశేష పరిశోధన అనుభవం కలిగిన సీనియర్ ప్రొఫెసర్లతో బోధన ఉంటుందని, రీసెర్చ్ స్కాలర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఆ విభాగం అధిపతి ఆచార్య పెదమళ్ల శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో కోరారు.
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు శేఖర్‌శర్మ, పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి దీవించారు.
చట్టాల అమలులో నిర్లక్ష్యం
వెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఏజెన్సీ చట్టాలను గౌరవిస్తూ ఆదివాసీల ఆభివృద్ధికి పాటు పడాలన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఆదివాసీల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ