కృష్ణగిరి: మండల పరిధిలో హంద్రీ – నీవా కాల్వలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోడుమూరు మండలం, అనగొండకు చెందిన సాయిపోగు హరిబాబు (28)కు భార్య యశోద, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్యనే పెయింటర్ పనికి స్వస్తి పలికి గౌండ పనికి వెళుతున్నాడు. రెండు రోజుల క్రితం గ్రామంలో పక్కింటి వారితో గొడవపడి వెల్దుర్తిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం బైక్‌పై వెల్దుర్తి నుంచి టి.గోకులపాడు గ్రామానికి వచ్చే రహదారిలో హంద్రీ – నీవా ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న మద్యం తాగి బంధువులకు ఫోన్ చేసి కాల్వలో దూకి చనిపోతున్నానని చెప్పాడు. వారు వెంటనే ఆ ప్రాంతానికి వచ్చి చూడగా బైక్ మాత్రమే ఉండటంతో కాలువలో దూకి ఉంటాడని నిర్ధారించుకున్నారు. కాల్వలో ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు చేపట్టేందుకు అంతరాయం ఏర్పడింది. ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు కాలువ వెంట గాలిస్తున్నారు. యువకుడి అత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.


