భృంగివాహనంపై కొలువైన స్వామిఅమ్మవార్లకు
పూజలు చేస్తున్న దృశ్యం
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన భ్రమరాంబాదేవి వెలసిన శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. లోకకళ్యాణం కోసం ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో సహస్ర శత చండీ మహారుద్రయాగం చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరించారు. అమ్మవారి ఆలయం ముందు ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకృతులైన అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజాదికాలను, హారతులిచ్చారు.
భృంగివాహనసేవలో..
దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీమేళం, కొమ్ము, కోయనృత్యం, సంప్రదాయనృత్యం విళక్కు, స్వాగత నృత్యం, కోలాటం, రాజ భటుల వేషాలు, జానపద పగటి వేషాల ప్రదర్శన, అశ్వప్రదర్శన, ఢమరుకం, చిడతలు, పిల్లనగ్రోవి, శంఖం, త్రిశూలం, జేగంట, కంచుడోలు, కొమ్ము, తాళాలు, చెక్కభజన, అమ్మవారి వేషం, తప్పెటచిందు, డోలు విన్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీశైలంలో నేడు
దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో, స్వామిఅమ్మవారలు మయూరవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.


