కర్నూలు సిటీ: సుంకేసుల జలాశయం గేట్లను డ్యాం భద్రత నిపుణుల కమిటీ సభ్యులు ఆదివారం పరిశీలించారు. గేట్లు, వాటి పనితీరుపై వీరికి ఇన్‌చార్జ్ డీఈఈ ప్రసాద్ రావు, ఏఈఈ మహేందర్ రెడ్డి వివరించారు. గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతున్న విషయంపై నిపుణులు ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంజినీర్లతో సమావేశం అయి చర్చించారు. గుర్తించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ సభ్యుల్లో కేఆర్‌ఎంబీ మాజీ చైర్మన్ అలవాల పరమేశం, రిటైర్డ్ ఎస్‌ఈ కె.లక్ష్మీరెడ్డి, రిటైర్డ్ ఈఈ ఎన్.శ్రీకాంత్, రిటైర్డ్ ప్రొఫెసర్ జీ.ఎల్ శివకుమార్ తదితరులు ఉన్నారు.
డిసెంబర్‌లోపు మూల్యాంకనం పూర్తి
డ్యాం భద్రత చట్టం 2021లో అమలులోకి వచ్చింది. స్వతంత్ర నిపుణుల బృంద సభ్యులు ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టుల డ్యాం భద్రతా మూల్యాంకనం (సీడీఎస్‌ఈ) పూర్తి చేయాలి. ఈ ఏడాది డిసెంబరులోపు డ్యాం భద్రత మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత సీడీఎస్‌ఈ నివేదికను రాష్ట్ర డ్యాం భద్రతా సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 151 సాగు నీటి ప్రాజెక్టుల గేట్ల పనితీరుపై డ్యాం సేఫ్టీ నిపుణుల కమిటీ తనిఖీలు చేపట్తింది. కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ పరిధిలోని 10 డ్యాంలు ఉన్నాయి. వీటికి సంబంధించి బృంద సభ్యులు ఈ ఏడాది జూలై 2, ఆగస్టులో 3, సెప్టెంబరులో 3 ప్రాజెక్టులను సందర్శించారు. ఈ నెల రెండు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా సుంకేసుల బ్యారేజీని సందర్శించారు.


