జిల్లాలో 5,244 పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 5,244 పోలింగ్‌ కేంద్రాలు

Aug 31 2026 1:44 AM | Updated on Aug 31 2026 1:44 AM

నేడు తుదిజాబితా ప్రచురణ

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సోమవారం పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రచురిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్‌ తెలిపారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులకు 5,244 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియను చేపట్టామని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాలను ఆయా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ముఖ్యమైన రెండు కార్యాలయాల్లో ప్రచురిస్తామని పేర్కొన్నారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలు ఇవ్వా లని సూచించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

క్వింటా వేరుశనగ రూ.9,290

ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్ట ధర రూ.9,290 లభించింది. మార్కెట్‌కు 1,056 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్టంగా రూ.4,390, మధ్యస్థంగా రూ.7,700 ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.

వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

భార్య మృతి.. భర్త గల్లంతు

గుంతకల్లుటౌన్‌/చిప్పగిరి: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు హంద్రీ–నీవా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో భార్య మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన భర్త కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు...చిప్పగిరి మండలం బెలడోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ (60), సీతానంద(64) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు కుమారుడు నారాయణ వద్ద ఉంటున్నారు. వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుంతకల్లులో ఆస్పత్రికి వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన వీరు బస్సులో కసాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి హంద్రీ–నీవా కాలువ వద్దకు వెళ్లి నీటిలో దూకారు. నీటిలో తేలియాడుతున్న సోమలింగమ్మను స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. నీటిలో గల్లంతైన సీతానంద కోసం గాలింపు చేపట్టారు. దంపతులు అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కసాపురం ఎస్‌ఐ వెంకటస్వామి తెలియజేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

మొక్కజొన్న పంట

జీవాలకు మేత

నందికొట్కూరు: పక్కనే హంద్రీ నీవా కాల్వల్లో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎక్కడో దూరాన ఉన్న అనంతపురం, కుప్పానికి నీళ్లు తరలిస్తున్న ప్రభుత్వం ఇక్కడి రైతుల గురించి పట్టించుకోవడం లేదు. వర్షాలు లేక, కాల్వలకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. దామగట్ల గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్న పొలంపక్కన హంద్రీనీవా కాలువ ఉంది. మొక్క జొన్న పంట సాగు చేయగా వర్షాలు లేకపోవడంతో పంట గిడసబారిపోయింది. చివరకు పంటను జీవాలకు మేతగా వదిలేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement