ఓర్వకల్లు: జీవాలను మేపడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బోయ బంకు వెంకటేశ్వర్లు (53) నిమ్మతోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటన స్థలంలో హ్యత చేసినట్లు అనవాళ్లు కనిపిస్తున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీదివేముల గ్రామానికి చెందిన బోయ బంకు వెంకటేశ్వర్లు తనకు ఉన్న నాలుగు జీవాలను మేపడానికి ఆదివారం ఉదయం వెళ్లాడు. మీదివేముల, నన్నూరు గ్రామాల మధ్య ఉన్న దిగువయ్యస్వామి దర్గా వద్ద గల నిమ్మతోటలో మృతదేహంగా కనిపించాడు. అక్కడే ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బోయరమేష్ ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు కర్నూలు తాలూకా సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కంటిపై, శరీరంపై పలు చోట్ల పేడరంగులో కలిపే రసాయనాలు పడినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో మనిషిని ఈడ్చుకవెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్లును ఎవరైనా సరిపోని వ్యక్తులు హత్యచేసి, ఎవరినీ గుర్తుపట్టలేని రీతిలో ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతుని శరీరంపై పేడరంగు రసాయనాలు చల్లినట్లు అనుమానిస్తున్నారు. అంతేగాక వెంకటేశ్వర్లు గొంతుపై గాట్లు ఉండడంతో అతని మృతిపై పలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. వెంకటేశ్వర్లుది హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో విచారిస్తున్నారు. గ్రామంలో రెండేళ్ల క్రితం ఇచ్చిన ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటుండగా, సదరు భూమి తమదని నన్నూరు గ్రామానికి చెందిన వ్యక్తులు వేధిస్తున్నారు. ఈ మేరకు మృతుని భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు ఇచ్చారని పోలీసులు తెలిపారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన కాటసాని
వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించిన స్థలాన్ని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మృతుడు వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అనేది నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవ విషయాలను నిగ్గుతేల్చాని పోలీసులకు విన్నవించారు. వారి వెంట ఓర్వకల్లు వైఎస్సార్‌సీపీ నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు.
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు
యత్నం
మృతదేహాన్ని పరిశీలించిన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి


