కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్‌లో సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో.. వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 73826 14308 నంబర్‌కు ఫోన్ చేసి తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు గాయాలు
బండిఆత్మకూరు: మండలంలోని చిన్న దేవళాపురం గ్రామంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో దంపతులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ నాగమ్మ ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లొచ్చిన అనంతరం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నాగమ్మకు, భర్త సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులు కొంతమేర ధ్వంసమయ్యాయి.వ గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం బండి ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి
ఆదోని అర్బన్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత సమాజంలో విబేధాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల హక్కులు, ఐక్యతను పరిరక్షించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రమోహన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
భార్య అనారోగ్యంతో ఉందని ఆత్మహత్యాయత్నం
ఆదోని అర్బన్: మండల పరిధిలోని ఆరేకల్ గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి భార్యకు అనారోగ్యం ఉందని మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందు భార్య కిడ్నీ సమస్యలతో బాధపతూ కర్నూలులో చికిత్స పొందుతోంది. దీనిని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అవుట్ పోస్టు పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న గోవిందును స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
గుడిసె దగ్ధం
హాలహర్వి: మండలంలోని నిట్రవట్టి గ్రామంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన కజ్జి నాగరాజుకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు గుడిసె పైకప్పుకు అంటుకున్నాయి. ఎండ తీవ్రత, గాలి తోడవడంతో క్షణాల్లోనే మంటలు గుడిసె అంతటా వ్యాపించాయి. గుడిసె నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావంతో గమనించిన స్థానికులు తక్షణమే మంటలను అదుపు చేసేందుకు నీళ్లు, ఇసుక వేశారు. పక్కనే ఇతర ఇళ్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. గుడిసెలో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, విలువైన సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో రూ.లక్ష దాకా ఆస్తి నష్ట వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


