పోతిరెడ్డిపాడు గేట్లను తాకిన కృష్ణాజలాలు | - | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడు గేట్లను తాకిన కృష్ణాజలాలు

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయంలోకి 1,69,211 క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతుండటంతో డ్యాంలో గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాంలో 849.70 అడుగులకు నీటిమట్టం చేరుకోగా కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లను తాకాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీశైలం డ్యాంలో 849.70 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 848.70 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నందున మరో రెండు, మూడు రోజుల్లో డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరుకొనే అవకాశం ఉంది. ఖరీఫ్‌ సీజన్‌కుగాను జూన్‌ మొదటి వారంలో కురిసిన వర్షాలకు తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్‌, కేసీ ఎస్కేప్‌ కాల్వల కిందున్న ఆయకట్టు రైతులు మొక్కజొన్న, మినుము, కంది తదితర పంటలు సాగుచేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాల్వలకు సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారా? పంటలను ఎలా కాపాడుకోవాలా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి సత్వరమే అనుమతులు పొంది వెంటనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తి కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

గతేడాది జులై 5న నీటి విడుదల

గతేడాది జులై 6న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా దిగువనున్న కాల్వలకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన వర్షాలవల్ల శ్రీశైలం డ్యాంలోకి వరద నీరు పోటెత్తడటంతో డ్యాం క్రమేణా జలకళ సంతరించుకొంటోంది. డ్యాంలో మరో రెండు రోజుల్లో 854 అడుగుల నీటిమట్టం చేరుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement