మంత్రాలయం రూరల్: కర్ణాటక బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడు హెచ్.తిక్కయ్య (67)మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని చెట్నెహళ్లిలో ఆదివారం చోటు చేసకుంది. ఘటనపై ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. తిక్కయ్య ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తూ రోడ్డు దాటుతుండగా మంత్రాలయం వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కర్ణాటక బస్సు (కేఎ 36 ఎఫ్ 1750) ఢీకొట్టింది. బస్సు చక్రాల కింద నలిగి తిక్కయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకొని తిక్కయ్య మృతదేహంతో జాతీయ రహదారిపై దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరిబాబుతో వాగ్వాదానికి దిగారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పారు. తహసీల్దార్ వెంటనే ఆర్డీఓకు సమాచారం అందించడంతో ఆర్డీఓ కె.అరుణాదేవి, తహసీల్దార్, సీఐ వచ్చి పరిశీలించి జీబ్రా క్రాసింగ్, సిగ్నల్ లైట్ వద్ద సిమెంట్‌తో యుద్ధ ప్రాతిపదికన స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. ధాదాపు రెండు గంటల పాటు ధర్నా జరగడంతో మంత్రాలయంకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు అతివేగం తగ్గించుకోవాలని, లేదంటే వాటిని నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై తరచూప్రమాదాలు జరిగే స్పాట్‌లను గుర్తించామని, ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మృతదేహన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమదానికి కారణమైన బస్సు డ్రైవర్ మల్లన్న (41)ను అదుపులోకి తీసుకుని బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జాతీయ రహదారిపై ధర్నాకు
దిగిన కుటుంబ సభ్యులు
స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసిన
అధికారులు
ఘటనా స్థలాన్ని
పరిశీలించిన ఆర్డీఓ


