● స్నానానికి వెళ్తూ జారిపడిన తల్లీబిడ్డ ● తల్లిని రక్షించిన స్థానికులు ● బాలిక కోసం గాలింపు చర్యలు
ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ గ్రామంలో అల్లీపీరస్వామి ఉరుసుకు కుటుంబంతో వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ చెరువులో గల్లంతైంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన రజియా తన కుమార్తె ఆఫ్రిన్(7)తో శుక్రవారం సాయంత్రం బంధువులతో గుడేకల్లుకు చేరుకుంది. రాత్రి దర్గా సమీపంలో నిద్రపోయి శనివారం ఉదయం చెరువు దగ్గర స్నానం చేసేందుకు బంధువులతో కలసి వెళ్లారు. చెరువు దగ్గర సిమెంట్ దిమ్మైపె రజియా, ఆఫ్రిన్ నడుస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి ఇద్దరూ చెరువులో పడిపోయారు. అయితే అక్కడే స్నానాలు చేస్తున్న కొందరు వెంటనే రజియాను రక్షించి బయటకు తీసుకురాగా, బాలిక జాడ కనిపించ లేదు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించటంతో రూరల్ సీఐ చిరంజీవి, నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఫైర్ అధికారి ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ముర్రవాడ భార్గవి చెరువు దగ్గరకు చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రజియా భర్త సిద్దూసాబ్ చనిపోగా తన ముగ్గురు కమార్తెలను పోషిస్తూ జీవనం సాగిస్తుంది. చివరి అమ్మాయి ఆఫ్రిన్ చెరువులో పడి మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలిపిస్తోంది. సాయంత్రం వరకు బాలిక జాడ కనిపించకపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పిస్తున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. దైవ దర్శనం కోసం విషాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.


