కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్ అయ్యారు. బుధవారం జరిగిన నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 8,338 మందికి 7,525 మంది విద్యార్థులు హాజరు కాగా 807 మంది గైర్హాజరయ్యారు. ఓర్వకల్ జడ్పీహెచ్ కేంద్రంలో ముగ్గురు, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల, కోడుమూరు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు.
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలి
కర్నూలు(అర్బన్): నగరంలో ఏర్పాటు చేయనున్న సఖీ నివాస్ ( వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ) కోసం మానవ వనరుల సరఫరా నిమిత్తం నమోదిత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు అభివృద్ధి, సాధికారత అధికారి పి. విజయ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. మొత్తం ఆరు పోస్టులకు అర్హత కలిగిన సంస్థలు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తులలు అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం కర్నూలు కలెక్టరేట్‌లోని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సాధికారత అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.
24 న హ్యాండ్‌బాల్
ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్) : ఈ నెల 24 వ తేదీ స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్–19 విభాగంలో బాల బాలికల జట్లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి పి.సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరచి ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 9, 10 తేదీల్లో కదిరి పట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పాల్గొనదలచిన క్రీడాకారులు వెంట వయస్సు ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలని సూచించారు.
బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి
పాములపాడు: మండలంలోని వేంపెంట గ్రామం వద్ద బ్రిడ్జిపై బుధవారం ఎదురెదురు గా బైక్‌లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వెలుగోడు ద్వారకా నగర్‌కు చెందిన సయ్యద్‌నూర్ (46) బైక్‌పై వెలుగోడుకు బయలుదేరాడు. బానుముక్కల గ్రామానికి చెందిన జాకీర్ వెలుగోడు నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. బ్రిడ్జి వద్దకు రాగానే సయ్యద్‌నూర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో నూరు మృతిచెందగా జాకీర్‌కు గాయాలయ్యాయి. మృతుడికి భార్య సయ్యద్ రమిజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తగ్గిన వేరుశనగ ధర
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ ధర క్వింటం రూ.6,670కు పడిపోయింది. బుధవారం మార్కెట్‌కు వేరుశనగ దిగుబడులు 190 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం ధర గరిష్టంగా రూ.6,670 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటం రూ.5,490, మధ్యస్థ ధర రూ.6,080 పలికినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆముదాలు 34 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,870, మధ్యస్థ ధర రూ.5,890, గరిష్ట ధర రూ.5,910, కందులు కేవలం రెండు క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.6,520 పలికిందన్నారు.
బావిలో పడి
వివాహిత మృతి
నందవరం: ప్రమాదవశాత్తూ బావిలో పడి వివాహిత మృతి చెందాడు. మండల పరిధిలోని ఇబ్రహీంపురం గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన కురవ మల్లేశ్వరి (45) బుధవారం బట్టలు ఉతకడానికి స్థానిక బావి వద్దకు వెళ్లింది. బట్టలు ఉతికే సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడిపోయింది. బంధువుల పెళ్లి నిమిత్తం నదికై రవాడి గ్రామానికి వెళ్లిన ఆమె భర్త మల్లికార్జున మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య మల్లేశ్వరి కనిపించకపోడంతో చుట్టు పక్కల గాలించాడు. ఎక్కడా కనిపించకపోవడంతో బావి వద్దకెళ్లి చూడగా గట్టుపై బట్టలు, చెప్పులు కనిపించాయి. అనుమానంతో గ్రామస్తుల సాయంతో ట్రాక్టర్ల ద్వారా బావిలోని నీరు తోడించగా భార్య మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


