పోలీసు అండతోనే దాడులు
● ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు ● టీడీపీ అరాచకాలపై 5న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ● మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరురూరల్: పోలీసుల అండతోనే తెలుగు దేశం నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు విరూపాక్షి, సూర్యనారాయణను మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజకు టీడీపీ అరచకాలు పెరిగిపోతున్నాయన్నారు. తెలుగుదేశం నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో మరింత రెచ్చిపోతున్నారన్నారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులను స్టేషన్‌లోనే ఉంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఇంత వరకు పోలీసులు వెళ్లి విచారణ చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. ఉదయం దాడి జరిగితే ఇప్పటి వరకు నందవరం ఎస్‌ఐ, రూరల్ సీఐ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవటం దురదుష్టకరమన్నారు. పోలీసులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పోలీసుల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, టీడీపీ నాయకులు గుర్తించుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం నాయకులు అరచకాలు, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐల తీరుపై ఈ నెల 5వ తేదీన జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయ నతో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం సంయుక్త కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, గడ్డం నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.


