
గిజిగాడి ప్రేమ సౌధాలు!
దొర్నిపాడు: అత్యద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో గిజిగాడు పక్షి నిర్మించిన వేలాడే గూళ్లు చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. మండలంలోని డబ్ల్యూ కొత్తపల్లె, చాకరాజువేముల, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామాల శివారుల్లో నీటి కుంటల మధ్య తుమ్మ, రేగుచెట్ల కొమ్మలకు ఏర్పాటు చేసుకున్న గూళ్లు ఆ వైపు వెళ్లిన వారికి కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం గిజిగాడి సంతానోత్పతి కాలం కావడంతో ఎక్కడ చూసినా గూళ్లు ఆకట్టుకుంటున్నాయి.
చెట్టు కొమ్మపై పక్షులు
ఎంతో నేర్పరితనం..
గిజిగాడు కట్టే గూడు ఎంతో నేర్పరితనం కల్గి ఉంటుంది. గూళ్లు అల్లడం, పిల్లలకు ఆహారం నోటికి అందించడం, శత్రువులను ఎదుర్కొనడం.. పాములు, ఇతర శత్రువుల నుంచి గుడ్లనూ, పిల్లల్నీ కాపాడుకోవడానికి ముళ్ల చెట్లపైన, నీటికి దగ్గరగా కిందకు వేలాడే రీతిలో కట్టుకోవడం వీటి అద్భుతమైన తెలివికి నిదర్శనం అని చెప్పవచ్చు.
ప్రేమ కోసం..
ఈ పక్షిజాతిలో మగపక్షి చక్కటి ఇంజినీరింగ్ ప్రతిభతో అందంగా గూడును అల్లి ఆడ గిజిగాడిని ఆకర్షిస్తుంది. ఆడపక్షికి ఆ గూడు నచ్చితే అందులో ఆవాసం ఎర్పరచుకొని మగపక్షితో జతకట్టి జీవనం గడుపుతుంది. ముందుగా మగ గిజిగాడు సగం గూడు అల్లాక రెక్కలు ఆడిస్తూ ఆడపక్షుల వద్దకు వచ్చి తాను తయారు చేస్తున్న గూడు చూడమన్నట్లు సంకేతం ఇస్తుంది. గుంపులో ఉన్న ఏ ఒక్క ఆడపక్షి మెచ్చకపోయినా దాన్ని వదిలేసి మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట. అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగానే ఉండాల్సిందేనట. మంచిగా గూడు కట్టే ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడ పక్షుల ప్రేమను పొందుతాయట. వినడాడికి ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో ఆసక్తి అనిపిస్తుంది కదా. పాపం గిజిగాడు ప్రేమకోసం ఎన్ని కష్టాలో.

గిజిగాడి ప్రేమ సౌధాలు!

గిజిగాడి ప్రేమ సౌధాలు!