
భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోవాలి
కర్నూలు(హాస్పిటల్): ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోగలిగితే మానసికంగా దృఢంగా ఉంటారని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయసేవాసదన్ సివిల్ జడ్జి బి. లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం ప్రపంచ మాన సిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూ లు మెడికల్ కాలేజీలోని సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, సామాజిక ఆరోగ్యం బాగున్నప్పుడే వారిని ఆరోగ్యవంతులు అంటారన్నారు. వ్యక్తులు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు స్నేహితులు, దగ్గరి బంధువులు వారిని గుర్తించి కలుపుకుని వెళ్తే ఆ సమస్యలోంచి బయటపడతారన్నారు. పౌరులకు ఎవ్వరికై నా ఇబ్బందులు ఎదురైనప్పుడు లీగల్ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100ను సంప్రదించాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ.. ‘విపత్తులు, ఆపత్కాల పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యసేవలో అందుబాటులో’ అన్నది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించారన్నారు. ఎవ్వరికై నా మానసికంగా ఆపత్కర పరిస్థితి ఏర్పడితే సేవల కోసం టెలీమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 నంబర్‌ను సంప్రదించాలన్నారు.అనంతరం మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.చివరగా నర్సింగ్ కాలేజిజీ విద్యార్థులు ‘ఒత్తిడి సమయాల్లో ఎలా వ్యవహరించాలి’ అనే నాటిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎండోక్రైనాలజి హెచ్‌ఓడీ డాక్టర్ పి.శ్రీనివాసులు, డీఎల్‌ఎస్‌ఏ సభ్యులు రాయపాటి శ్రీనివాస్, సైకియాట్రి విభాగ వైద్యులు గంగాధరనాయక్, యతిరాజు, ఎస్‌ఆర్‌లు ఉమైద్ సిరాజ్, జయశ్రీ, పీజీలు పాల్గొన్నారు.
మానసిక వ్యాధుల విభాగం సందర్శన..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వ్యాధుల విభాగాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న మానసిక రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం అక్కడి రోగులను చూసుకునే తల్లిదండ్రులు, ఇతర పరిచారికులకు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆరోగ్య సంరక్షణ హక్కు, ఆస్తి హక్కు మొదలైన వాటితో సహా మానసిక రోగుల హక్కులు, వారి రక్షణ, వైద్యచికిత్సల గురించి వివరించారు. సమాజంలో అందరిలాగే వీరికీ జీవించే హక్కు ఉందని తెలిపారు.