
ఇసుక మాఫియా డాన్ హొళగుంద ఎస్‌ఐ
వైఎస్సార్‌సీపీ నాయకులను వేధిస్తే డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం
ఎస్‌ఐపై చర్యలు తీసుకోకపోతే పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తాం
హెచ్చరించిన వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షి
కర్నూలు(సెంట్రల్): హొళగుంద ఎస్‌ఐగా పనిచేస్తున్న దిలిప్‌కుమార్ ఇసుక మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నారని ఆలూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బి.విరుపాక్షి సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ఆయనే రెండు టిప్పర్లను ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్నారని, ఇతరులు ఎవరైనా టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తే అందులో ఒక్క ట్రిప్పును ఎస్‌ఐ పేరిట వేసి డబ్బు వసూలు చేసిచ్చేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఎమ్మెల్యే బి.విరుపాక్షి కలెక్టర్‌ను కలిసేందుకు కర్నూలు వచ్చారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో మీడియాతో మాట్లాడుతూ హొళగుంద ఎస్‌ఐ దిలిప్‌కుమార్ కాకి డ్రెస్సు ముసుగులో టీడీపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, బలవంతంగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను టీడీపీలో చేరుస్తున్నట్లు చెప్పారు. ఇటీవల హొళగుందలో వాటర్ ఫిల్టర్ కోసం రూ.19 లక్షల జెడ్పీ నిధులు మంజూరయ్యాయన్నారు. అయితే పనులను చేసుకోవాలంటే వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఇతర నాయకలను టీడీపీలో చేరాలని బలవంతం చేస్తున్నారన్నారు. మరోవైపు ఎస్‌ఐ దిలిప్‌కుమార్‌పై చర్యలు తీసుకోకపోతే హోళగుంద పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని, ఆయన పేరును వైఎస్‌ఆర్‌సీపీ డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తామని హెచ్చరించారు.
స్వయంగా రెండు టిప్పర్ల ద్వారా ఇసుక దందా