
కేసీలో గుర్తు తెలియని వ్యక్తి శవం
జూపాడుబంగ్లా:కర్నూలు–కడప(కేసీ)కాల్వలో శుక్రవారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోయింది. శరీరం బాగా ఉబ్బిపోయి దుర్వాసన వెదజల్లుతున్న వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ కేసీ కాల్వలో కొట్టుకపోతుండటాన్ని పొలాలకు వెళ్తున్న కూలీలు, రైతులు చూసి భయాందోళనకు గురయ్యారు. మృతదేహంపై ఉన్న దుస్తువులు చిరిగిపోయి ఉండగా కాళ్లవద్ద కేవలం నల్లనిప్యాంటు మాత్రమే కనిపించింది. కేసీ కాల్వలో నీటి ప్రవాహం మొదలైందంటే చాలు కేసీ కాల్వలో మృతదేహాలు కొట్టుకపోవటం పరిపాటిగా కొనసాగుతుంది
అనుమతి లేని
టపాసులు పట్టివేత
నంద్యాల: నంద్యాల పట్టణంలో అనుమతి లేకుండా టపాసుల వ్యాపారం చేస్తున్న వారి ఇళ్లు, షాపులపై శుక్రవారం దాడులు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో పట్టణంలోని చిత్తలూరి వీధికి చెందిన కృష్ణమోహన్ అనే వ్యక్తి ఇంట్లో అనుమతులు లేకుండా రూ.30వేలు విలువ చేసే టపాసులు నిల్వ ఉంచుకున్నారని, వీటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఈ టపాసులను భద్రతా దృష్ట్యా గోడౌన్‌కు పంపామన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు చేస్తున్నామని, అనుమతి లేకుండా టపాసుల వ్యాపారం చేసినా, నిల్వ ఉంచుకున్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చీటీల పేరుతో
రూ.2 కోట్లకు టోపీ!
డోన్ టౌన్: చీటీల పేరుతో రూ.2 కోట్ల మేర వసూలు చేసిన వ్యక్తి అదృశ్యమవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్‌లో జరిగింది. వివరాలు.. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్న వాయిగండ్ల వెంకటేశ్వర్లు చీటీల వ్యాపారం చేస్తుండేవాడు. అందరి వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు బయటి వ్యక్తుల వద్ద కూడా ఫైనాన్స్ డబ్బులు తీసుకున్నాడు. కొన్ని రోజులుగా అతను కనిపించకపోవడంతో.. డబ్బు లిచ్చిన వారంతా ఆందోళనకు గురయ్యా రు. కర్నూలులో ఉంటున్న అతని సోదరులకు ఫోన్లు చేసినా ఉపయోగం లేకపోవడంతో.. బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. వెంకటేశ్వర్లు ఐపీ పెట్టాలనే ఉద్దేశంతో ఇల్లును సైతం కొద్ది రోజుల క్రితం ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై బాధితులు శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.