
ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి దాడి
● కేసు నమోదు చేసిన పోలీసులు
గోనెగండ్ల: తన కుమారుడిని మందలించాడని ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి దాడి చేసిన సంఘటన గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత ఉపాధ్యాయుడు బసవరాజు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు.. కర్నూలుకు చెందిన బసవ రాజు గత ఎనిమిదేళ్లుగా గాజులదిన్నె గ్రామంలో ప్రాథమిక పాఠశాల(ఎస్సీ కాలనీ)లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అదే కాలనీకి చెందిన మీసాల రంగస్వామి కుమారుడు హర్షవర్ధన్ మానసిక దివ్యాంగుడు. ఆ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. కాగా మూడు, నాలుగు రోజులుగా హర్షవర్ధన్ పాఠశాలకు రాకపోవడంతో గురువారం ఉపాధ్యాయుడు బసవరాజు కొంత మంది విద్యార్థులను బాలుడి ఇంటికి పంపాడు. అయితే తన కుమారుడిని ఉపాధ్యాయుడు భయపెట్టాడని, అందుకే పాఠశాలకు రావడం లేదని తండ్రి మీసాల రంగస్వామి విద్యార్థులకు చెప్పి పంపాడు. ఇంటి వద్దకు విద్యార్థులను ఎలా పంపుతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉదయం బైక్‌పై పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడు బసవరాజుపై ఈత కర్రతో దాడి చేశాడు. అక్కడే ఉన్న కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయుడికి ముక్కుకు, తలకు, చేతికి రక్త గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఉపాధ్యాయుడు బసవ రాజు, ఎంఈఓలు రామాంజినేయులు, నీలకంఠ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు మీసాల రంగస్వామిపై దాడి కేసు నమోదు చేశారు.
చివరి రోజు దాడి..
ఒకే చోట ఎనిమిదేళ్లు పనిచేస్తున్న బసవరాజును గాజులదిన్నె నుంచి కోడుమూరుకు బదిలీ చేశారు. గాజులదిన్నె పాఠశాలలో శుక్రవారం చివరి రోజు విధులు నిర్వహించి సోమవారం కోడుమూరు పాఠశాలలో జాయిన్ కావాల్సి ఉంది. కాగా చివరి రోజు విధులు నిర్వహించాలని వచ్చిన ఉపాధ్యాయుడికి ఇలాంటి సంఘటన జరగడం విచారకరం అని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి దాడి