
మోదీ పర్యటనను విజయవంతం చేద్దాం
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మంత్రులు బీసీ జనార్థన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం నన్నూరు సమీపంలోని రాగమయూరిలో జరుగుతున్న ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పీఎం ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ తదితరులు పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ స్థానికంగా టోల్ గేట్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 16వ తేదీన టోల్‌ఫీజు లేకుండా వాహనాలను వదలాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైల దర్శనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి మోదీ బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభా ప్రాంగణంలోకి పెన్నులు, నోటుబుక్‌లు, మ్యాచ్ బాక్సులు, సిగరెట్లు, స్నాక్స్ వంటివి అనుమతించకూడదని, కేవలం నీటిని మాత్రం కప్‌ల ద్వారా ట్రేలలో అందిస్తారన్నారు. సెక్యూరిటీ పరంగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలాఉంటే ఆదివారం ప్రధానమంత్రి పర్యటించే రూట్లన్నీ ఎస్‌పీజీ సెక్యూరిటీ ఆధీనంలోకి వెళ్తాయని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్, విజయ సునీత, శివ్ నారాయణ్, డాక్టర్ బి.నవ్య, గణేష్‌కుమార్, గీతాంజలి, జేసీ నూరుల్ ఖమర్, ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ పాల్గొన్నారు.