విత్తుకోని ఆశలు.. పొలాలు బీళ్లు! | - | Sakshi
Sakshi News home page

విత్తుకోని ఆశలు.. పొలాలు బీళ్లు!

Oct 12 2025 7:09 AM | Updated on Oct 12 2025 7:09 AM

విత్తుకోని ఆశలు.. పొలాలు బీళ్లు!

విత్తుకోని ఆశలు.. పొలాలు బీళ్లు!

కర్నూలు (అగ్రికల్చర్‌): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎరువులు అందక, ప్రకృతి సహకరించక, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలే మిగులుతున్నాయి. ఖరీఫ్‌లో వేసిన పంటలన్నీ మట్టిపాలయ్యాయి. అరకొర పండిన పంటలకు మార్కెట్‌లో మద్దతు ధర కూడా లభించక మట్టి మనిషికి కన్నీళ్లే దిక్కయ్యాయి. రబీపై ఆశలు పెట్టుకున్నా.. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా మొండికేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో చాలా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.

అవసరం ఎక్కువ... కేటాయింపు తక్కువ

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా 3.85 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రకృతి వైపర్యీతాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పంటలు దెబ్బతిని 2.50 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలో శనగ సాగు చేద్దామనుకుంటే సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. విత్తనం వేయకపోవడంతో పొలాలు బీళ్లుగా దర్శనం ఇస్తున్నాయి. జిల్లాకు 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించగా 23,897 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వీటిలో 10 వేల క్వింటాళ్లు ఏపీ సీడ్స్‌లో ఉన్నాయి. ప్రయివేటు విత్తన కంపెనీల దగ్గర శనగ విత్తనాలు ఉన్నప్పటికీ గత ఏడాదికి సంబంధించిన బకాయిలను ఇప్పటికి చెల్లించలేదు. ఉన్న అరకొర విత్తనం ఎవరికి పంపిణీ చేయాలో తెలియక వ్యవసాయ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రబీలో శనగతో పాటు వేరుశనగ, జొన్న తదితర పంటలు సాగు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ విత్తనాలను మినహా ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిల్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. కేంద్ర వాటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే కొన్ని పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇవ్వలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.14 వేలకు కుదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పంట రుణాల పంపిణీలో నిర్లక్ష్యం

రైతులకు ఎటువంటి హామీ లేకుండానే రూ.2లక్షల వరకు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. పంటరుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు తీవ్ర అలసత్వం వహించాయి. ఖరీఫ్‌ సీజన్‌ సెప్టెంబరు నెల చివరితోముగిసింది. ఖరీఫ్‌లో రూ.3,635.62 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా రూ.2,537.61 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు స్పష్టం అవుతోంది. పలు బ్యాంకులు కొత్త రైతులకు రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రబీ సీజన్‌లో రూ.2,526.44 కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఖరీఫ్‌లో రైతులకు మొండిచెయ్యి చూపిన బ్యాంకులు రబీలో పంపిణీ చేయడం అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎరువులు అందేనా?

రబీ సీజన్‌లో శనగ, జొన్న, వాము, వరి, వేరుశనగ తదితర పంటలు కర్నూలు జిల్లాలో 1.01 లక్షలు, నంద్యాల జిల్లా 1.73 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు లక్ష టన్నులు, నంద్యాల జిల్లాకు 1.52 లక్షల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. రబీలోనూ ఎరువుల సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధర ఎక్కువ.. సబ్సిడీ తక్కువ

బహిరంగ మార్కెట్‌లో శనగల కిలో ధర గరిష్టంగా రూ.55 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం సబ్సిడీ పోను కిలో శనగ విత్తనాలను రూ.58.50 ప్రకారం పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధిక ధర నిర్ణయించి సబ్సిడీ మాత్రంగా 25 శాతానికే పరిమితం చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే శనగ విత్తనాలు కిలో ధరను రూ.78గా నిర్ణయించింది. ఇందులో 25శాతం సబ్సిడీ (రూ.19.50) పోగా రైతులు కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఇంతకంటే తక్కువ ధరకు లభిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఆంద్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ 20కిలోల ప్యాకెట్లతో శనగ విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఎకరాకు 80కిలోల శనగలు అవసరం. అయితే ఎకరాకు 60 కిలోలు(3 ప్యాకెట్లు) మాత్రమే పంపిణీ చేయనున్నారు. భూమిని బట్టి ఎకరాకు గరిష్టంగా 10 ప్యాకెట్లు( 2 క్వింటాళ్లు) పంపిణీ చేస్తారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో

ప్రారంభమైన రబీ

అతీగతీ లేని సబ్సిడీ విత్తనాలు

అరకొరగా పంట రుణాల పంపిణీ

వేధిస్తున్న ఎరువుల సమస్య

పొంచి ఉన్న అధిక వర్షాల గండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement