
అందని ఆరోగ్య‘సిరి’
రాష్ట్ర వ్యాప్తంగా తమకు బకాయి ఉన్న రూ.3వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా వ్యాప్తంగా ఎన్‌టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) నెట్‌వర్క్ ఆసుపత్రులు శుక్రవారం నుంచి సమ్మె ప్రారంభించాయి. గత నెలలోనే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నాయకులు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తప్పనిసరై వారు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా 57, నంద్యాల జిల్లాలో 25 ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో కొన్ని ఆసుపత్రులు రోగులకు అత్యవసర వైద్యం అందించేందుకు తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తున్నా ఆరోగ్యశ్రీలో నమోదు చేయడం లేదు. అడ్మిషన్ అవసరమైన వారికి ప్రాథమిక చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాయి. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్న వారికి మళ్లీ రావాలని వెనక్కి పంపిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయని కొందరు ముందుగానే తెలుసుకుని వాటికి రావడం మానేశారు. అయితే కర్నూలులో ఓ ప్రజాప్రతినిధికి సంబంధించి ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రులు సమ్మెకు దూరంగా ఉన్నాయి. దీంతో అత్యవసర చికిత్స అవసరమైన వారిని సమ్మె చేస్తున్న ఆసుపత్రుల నుంచి అక్కడికి రెఫర్ చేస్తున్నారు.