
జిల్లా అభివృద్ధికి కృషి
● జేసీగా బాధ్యతలు స్వీకరించిన
నూరుల్ ఖమర్
కర్నూలు(సెంట్రల్): జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అధికారుల సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జేసీని డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, సీపీఓ భారతి, సివిల్ సప్లయ్ డీఎం వెంకటరాముడు, డీఎస్‌ఓ రాజారఘువీర్, ఏపీ ఆర్. శివరాముడు తదితరులు అభినందించారు.
22న యువజనోత్సవ పోటీలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): యువజనోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 22న కర్నూలులోని రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి పోటీలను ఏడు విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్‌తో కలసి యువజనోత్సవ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో మొదటి స్థానంలో నిలిచిన విజేతలను రాష్ట్ర స్థాయికి, రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. ఆయా పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విజేతలకు జనవరం 12న యువజన దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను 22వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, వెబ్‌సైట్ ఇతర వివరాల కోసం 9292207601కు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ లాలెప్ప, ఏఓ శివరాముడు, సెట్కూరు పర్యవేక్షణాధికారి శ్యామ్‌బాబు పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పుత్తుల ధరలు మరింత పతనం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మా ర్కెట్‌లో ధరలు మరింత పడిపోయాయి. వేరుశనగ మద్దతు ధర రూ.7,263 ఉండగా మా ర్కెట్ లో గరిష్టంగా లభించిన ధర రూ.5,800 మా త్రమే. మార్కెట్‌కు 85 లాట్ల వేరుశనగ వచ్చింది. కనిష్టంగా రూ.3,402, గరిష్టంగా రూ.5,800 లభించగా.. సగటు ధర రూ.5,266 నమోదైంది.
● మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400. మార్కెట్‌లో మాత్రం కనిష్ట ధర రూ.1,695, గరిష్ట ధర రూ.1,721 మాత్రమే లభిస్తోంది.
● సజ్జకు మద్దతు ధర రూ.2775 ఉండగా మార్కెట్‌లో కనిష్టంగా రూ.1661, గరిష్టంగా రూ.2,200 పలికింది. సగటు ధర రూ.1850 నమోదైంది.
● మార్కెట్‌కు రూ.2,174 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనిష్ట ధర రూ.208, గరిష్ట ధర రూ.1289 లభించగా.. సగటు ధర రూ.587 నమోదైంది. అన్ని రకాల పంట ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నా కూటమి ప్రభుత్వం మేల్కొనకపోవడం గమనార్హం.

జిల్లా అభివృద్ధికి కృషి