
ప్రధాని సభకు విస్తృత ఏర్పాట్లు
● మూడు లక్షల మందికి సరిపడే విధంగా సదుపాయాల కల్పన ● పది వేల బస్సులకు పార్కింగ్ సౌకర్యం ● కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడి
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని పర్యటనకు సబంధించి సభ నిర్వహణ, హెలిప్యాడ్, పార్కింగ్ ఇతర ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, కుడా చైర్మన్ సోమిశెట్టి, సీఎం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం వెళ్తారన్నారు. శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబదేవి దర్శనం అనంతరం నన్నూరు టోల్ ప్లాజా వద్ద రాగమయూరి వెంచర్‌లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ బహిరంగ సభను 40 ఎకరాల్లో మూడు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 347 ఎకరాల్లో 10 వేల బస్సులు నిలుపుకునేలా 12 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి జాతీయ రహదారికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. సభకు వచ్చే వారికి 15 లక్షల లీటర్ల తాగునీరు, మజ్జిగ, భోజనం, అవసరమైన వైద్య సదుపాయాలు, టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఏర్పాట్లను పరిశీలించిన
మంత్రి, నోడల్ ఆఫీసర్
పీఎం సభా ఏర్పాట్లను మంత్రి టీజీ భరత్, పీఎం ప్రోగ్రాం నోడల్ అధికారి వీరపాండియన్, కలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి కలెక్టర్ వారికి వివరించారు. సభకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని వారు కలెక్టర్‌ను ఆదేశించారు.