
4.25 కిలోల బరువుతో మగ శిశువు జననం
కోడుమూరు రూరల్: కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ సాధారణ కాన్పులో 4.25 కిలోల బరువు ఉన్న పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. గోనెగండ్ల మండలం వెముగోడు గ్రామానికి చెందిన భారతి, నల్లన్న దంపతులకు ఇది వరకే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మూడో కాన్పు నిమిత్తం శనివారం తెల్లవారుజామున కోడుమూరు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరీక్షలు చేసిన గైనకాలజిస్ట్ పుష్పలత ఆ మహిళకు సాధారణ కాన్పు చేయగా 4.25 కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు. అప్పుడే శిశువులు మూడున్నర కిలోల వరకు బరువు ఉండటం సహజం కానీ.. ఈ శిశువు ఏకంగా 4.25 కిలోల బరువు ఉండడం విశేషమని వైద్యాధికారి డాక్టర్ నాగరాజు అన్నారు.
ఉపాధ్యాయుల ఆందోళన
కర్నూలు (సిటీ): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి, జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. గత నెలలో విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు అయిన వారికి ఇంతవరకు వేతనాలు రాలేదన్నారు. తక్షణమే టీచర్ల పొజిషన్ ఐడీలు ఇచ్చి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గిస్తామని చెప్పారని, కానీ ఆ భారం మరింత పెంచేలా ప్రస్తుత యాప్ ఉందని, వెంటనే ఆ యాప్‌లన్నింటినీ రద్దు చేసి ఉపాధ్యాయులను కేవలం బోధనలకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించుకోకుండా ఆ పనులు చేసేందుకు కావలసిన సిబ్బందిని విద్యాశాఖ నియామకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఇబ్రహీం, బాబు, సర్వేశ్వర రెడ్డి, మనుమంతు, కిషోర్, షఫీవుల్లా, కాంతారావు, రాముడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

4.25 కిలోల బరువుతో మగ శిశువు జననం