
మాజీ సైనికులకు సన్మానం
కర్నూలు(అర్బన్): కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులను స్మరించుకుంటూ మాజీ సైనికులను సన్మానించారు. శనివారం స్థానిక సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్‌ఆర్ రత్నరూత్ మాట్లాడుతూ.. 1999 కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యంలో 26వ వార్షికోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటున్నామన్నారు. జమ్ము కాశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి శత్రు సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు మే 1999లో కార్గిల్ యుద్ధం ప్రారంభమైందన్నారు. అప్పట్లో ఈ యుద్ధాన్ని ఆపరేషన్ విజయ్‌గా ప్రకటించారన్నారు. ఈ యుద్ధంలో అమరులైన వీర సైనికుల జ్ఞాపకార్థం ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్న మాజీ సైనికులను శాలువాలు, మొమెంటోలతో సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకురాలు మహేశ్వరమ్మ, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య, కార్యదర్శి ఎం సుధాకర్, కోశాధికారి నజీర్ అహమ్మద్, రాముడు, సింగ్ తదితరులు పాల్గొన్నారు.