
జంట ఆత్మహత్యాయత్నం
కదులుతున్న రైలు నుంచి దూకి వివాహిత మృతి
రైల్వే ట్రాక్‌పై పడుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె: ఉపాధి అవకాశాలు దక్కకపోవడంతో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. కదులుతున్న రైలు నుంచి దూకి వివాహిత మృతి చెందగా.. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని స్థానికుల సాయంతో పోలీసులు కాపాడారు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా అయ్యలూరుకు చెందిన మహేష్ బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అప్పటికే వివాహమై భర్త మృతిచెంది ఒంటరిగా జీవిస్తున్న దీపిక పరిచయమైంది. ఇద్దరూ కలసి సహజీనం సాగించేవారు. ఈ క్రమంలో పని కోసం వారం రోజుల క్రితం ఇద్దరూ గుంటూరుకు వెళ్లారు.
అక్కడ పని దొరక్కపోవడంతో గుంతకల్లు మీదుగా గురువారం అనంతపురానికి చేరుకున్నారు. అక్కడ కూడా పని దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమై అదే రోజు రాత్రి కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. మార్గమధ్యంలో దీపిక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకేసింది. పక్క స్టేషన్‌లో రైలు ఆగగానే కిందకు దిగిన మహేష్ రోడ్డు మార్గంలో గార్లదిన్నె మండలం ఎగువపల్లి సమీపంలోకి శుక్రవారం తెల్లవారుజాముకు చేరుకున్నాడు. జాతీయ రహదారి పక్కన వాకింగ్ చేస్తున్న స్థానికులను కలసి రైల్వే స్టేషన్‌కు మార్గాన్ని అడిగి, అటుగా కాకుండా నేరుగా రైల్వే ట్రాక్‌పై చేరుకుని పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు.
గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో గార్లదిన్నె ఎస్‌ఐ గౌస్ మహమ్మద్‌బాషా, సిబ్బంది అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తన భార్య రైలు నుంచి దూకిందని, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడినట్లు వివరించాడు. దీంతో విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు గార్ల దిన్నె – కల్లూరు మధ్య ట్రాక్‌పై పరిశీలన చేపట్టారు. కల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రామ్‌దాస్‌పేట వద్ద పట్టాలపై యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని దీపికగా మహేష్ నిర్ధారించాడు. ఘటనపై రైల్వే ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, యువతి మృతిపై అనుమానాలు ఉన్నట్లుగా పోలీసులు పేర్కొనడం గమనార్హం.