
మహిళ బలవన్మరణం
పెద్దకడబూరు/మంత్రాలయం రూరల్: ఒంటరితనం భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ శివాంజల్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం వగరూరు గ్రామానికి చెందిన కురువ పద్మావతి(36)కి పెద్దకడబూరు మండలం కంబలదిన్ని గ్రామానికి చెందిన కురువ నాగేంద్రతో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. అయితే భర్త కురువ నాగేంద్ర 12ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమహిళ ఒంటిరిగా తన పుట్టినిల్లు అయిన వగరూరు గ్రామంలోనే నివాసం ఉండేది. ఏడు నెలల క్రితం పద్మావతికి పక్షవాతం వచ్చి కుడిచెయ్యి పని చేయకుండా అయ్యింది. దీంతో ఒంటరితనం భరించలేక, చెయ్యి కూడా పని చేయకపోవడంతో మానస్తాపం చెంది ఈనెల 23న ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. వగరూరు చెరువులో పడి చనిపోయినట్లు శుక్రవారం గ్రామస్తులు గుర్తించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. పద్మావతి అన్న కురువ మల్లేష్ ఫ్యిరాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మంత్రాలయం ఎస్‌ఐ శివాంజల్ తెలిపారు.
మళ్లీ గ్రామాల్లో చిరుత పులి సంచారం
గోనెగండ్ల: మండలంలోని ఎన్నెకండ్ల, గంజిహళ్లి గ్రామాల్లో చిరుత పులి గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున మళ్లీ సంచరించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయం..భయంగా ఉన్నారు. ఫారెస్టు సిబ్బంది రవి కుమార్, పశువైద్యులు నిర్మల దేవి శుక్రవారం ఆయా గ్రామాల్లో తిరిగారు. పొలాల్లో చిరుత పాదముద్రలను పరిశీలించారు. దున్నపోతు కళేబరం దగ్గరకు వచ్చి చిరుత పులి మాంసంను తిన్నట్లు గుర్తించారు. కారుమంచి కొండల్లో నుంచి చిరుత పులి వచ్చి ఉంటుందని, మళ్లీ అక్కడికే వెళ్లి ఉంటుందని ఫారెస్టు సిబ్బంది తెలిపారు.