
భాగవతం అమృత భాండం
కొత్తపల్లి: భాగవతం మనిషికి అమృతతత్వాన్ని ప్రసాదించే అమృత భాండమని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు మల్లు వెంకట రెడ్డి అన్నారు. నందికుంట గ్రామంలోని పురాతన నందీశ్వరాలయంలో శుక్రవారం ధర్మ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వమాత సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాగవతాన్ని ప్రతి ఒక్కరూ అవ పోషణ పడితే మంచి ప్రవర్తన, సద్గుణాలు, మానవత్వం అలవడుతుందన్నారు. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టారు. ఇస్కాన్ ధర్మ ప్రచారకులు కీర్తి రాజదాసు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో పురోహితులు లక్ష్మీనారాయణ చారి, గ్రామ సర్పంచ్ పైరెడ్డి నిత్యలక్ష్మి, నారాయణరెడ్డి, గ్రామ పెద్దలు టి.మధుసూదన రెడ్డి, స్థానిక భజన బృందం సభ్యులు నారాయణ, శివన్న, పుల్లయ్య, దత్తు శివన్న, మహేష్, ప్రవీణ్, హేమంత్ సాయి, బాణ రామిరెడ్డితో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు.