
● ఒట్టి పొలాల్లోనే ఉల్లి నాట్లు
కోడుమూరులో ఒట్టి పొలంలో ఉల్లి నాట్లు వేస్తున కూలీలు
ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నకు నేడు అన్నీ కష్టాలే. ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వానలే తప్ప మళ్లీ వరుణుడి జాడలేకపోవడంతో పంటల సాగు భారమవుతోంది. ఉల్లి సాగుకు సమయమైనా, తగిన వానల్లేక రైతులు దిగాలు చెందుతున్నారు. అయితే మండలంలోని కోడుమూరు, వెంకటగిరి గ్రామాల్లోని రైతులు వరుణుడిపైనే భారమేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎలాంటి తేమలేని ఒట్టిపోయిన పొలాల్లో ఉల్లినాట్లు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికల్లా రైతులు వర్షాధారంగా ఉల్లి పంటను సాగు చేసేవారు. ఈ ఏడాది వానల్లేక భూమిలో తేమ లేకుండాపోయింది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అదను దాటిపోతుందన్న ఆందోళన, ఉల్లి నారు వృథా అవుతుందనే భయంతో రైతులు నాట్లకు సిద్ధమయ్యారు. ఎకరా ఉల్లి సాగుకు నారు కొనేందుకు రూ.15వేలకు పైనే ఖర్చవుతుంది. నాట్లు వేసేందుకు కూలీలకు ఎకరాకు రూ.10వేలకు పైనే వెచ్చించాలి. వాన కురిస్తే సరేసరి.. లేదంటే రెండు మూడు రోజుల్లో కష్టమంతా మట్టిపాలేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– కోడుమూరు రూరల్
భారమంతా వరుణుడిపైనే!