
అమ్మానాన్న మృతితో అనాథలుగా..
ఆస్పరి: సెంటు భూమి, సొంత ఇల్లు లేదు.. అడిగినప్పుడల్లా ఆకలి తీర్చే అమ్మ ఇక రాదు.. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్నిచ్చే నాన్న అనంత లోకాలకు వెళ్లారు.. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాద ఘటన ఆస్పరి మండలంలోని నగరూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు చెప్పిన వివరాలు మేరకు.. మహాదేవప్ప (50), రంగమ్మ (42) దంపతులకు ముగ్గురు కుమార్తెలు మౌనిక, శ్యామల, భూమిక ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ నాలుగేళ్ల క్రితం పెద్ద కుమార్తె మౌనికకు వివాహం చేశారు. ఇద్దరు కుమార్తెలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో భార్య రంగమ్మకు మూడేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధని తేలడంతో మహాదేవప్ప మనోవేదనకు గురయ్యాడు. కూలీ పనులు చేసుకుంటూనే భార్యకు చికిత్స చేయిస్తూ ఈనెల 6న మహాదేవప్ప గుండెపోటుతో మృతిచెందాడు. తండ్రి మృతితో తల్లడిల్లుతున్న కుమార్తెలకు ధైర్యం చెప్పే తల్లి రంగమ్మ సోమవారం మృతి చెందారు. దీంతో కుమార్తెలు తల్లి మృత దేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు మృతితో అనాథలైన చిన్నపిల్లలను చూసి అయ్యో పాపం అంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. శ్యామల, భూమికకు 75 ఏళ్ల అమ్మమ్మ గోవిందమ్మే దిక్కయ్యింది. వృద్ధురాలైన గోవిందమ్మ మనవరాళ్లను ఎలా పోషిస్తారని గ్రామస్తులు అవేదన చెందుతున్నారు. అనాథలైన శ్యామల, భూమికకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని నగరూరు గ్రామస్తులు కోరుతున్నారు.

అమ్మానాన్న మృతితో అనాథలుగా..

అమ్మానాన్న మృతితో అనాథలుగా..