
జీవన ఎరువులతో నేల సారవంతం
కర్నూలు(సెంట్రల్): రసాయన ఎరువులకు బదులు పచ్చిరొట్ట, జీవన ఎరువులను వాడితే భూమి సారవంతమై అధిక దిగుబడులు వస్తాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నదాతలకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పచ్చిరొట్ట, జీవన ఎరువుల వినియోగంపై ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక మోతాదులో వేసే రసాయనిక ఎరువులతో భూమి నిస్సారమవుతుందన్నారు. పచ్చిరొట్ట వినియోగంతో 25 శాతం, జీవన ఎరువులతో 10 శాతం రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.