
మహిళా జెడ్పీటీసీ సభ్యులకు 22 నుంచి శిక్షణ
కర్నూలు (అర్బన్): ఉమ్మడి జిల్లాలోని మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు డీపీఆర్‌సీ ప్రిన్సిపల్, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. మార్పు ద్వారా విజేతలు – సాధికారతతో సుపరిపాలన సాధ్యం’ అనే అంశంపై ఈ శిక్షణను జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో ఇవ్వనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి మహిళా జెడ్పీటీసీ సభ్యులందరూ తప్పక హాజరుకావాలని కోరారు.
6 మండలాల్లో తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ జిల్లాలోని ఆరు మండలాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు కురిశాయి. కౌతాళంలో 24, గూడూరులో 15.6, ఆదోనిలో 9.2, కోసిగిలో 8.2, నందవరంలో 4.6, ఓర్వకల్లులో 4.4 మి.మీ. ప్రకారం వర్షం కురిసింది. మూడు రోజుల్లో కేవలం 13.7 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ. ఉండగా 20 రోజుల్లో 58.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలు తేలికపాటికే పరిమితం అవుతుండటంతో పంటల్లో పెరుగుదల ఆగిపోయింది.
కుంబళనూరు వంకలో మొసలి
కౌతాళం: కుంబళనూరు వంక వద్ద భారీ మొసలి నీళ్లల్లో అటు ఇటూ తిరుగుతూ కనిపిస్తోంది. దీంతో రైతులు, పనులకు వెళ్లే కూలీలు భయందోళన చెందుతున్నారు. గత రెండు రోజుల నుంచి వంకను దాటలేకపోతున్నారు. కుంబళనూరు గ్రామం, కుంబళనూరు క్యాంపు–1, క్యాంపు–2, నదిచాగి, మేళిగనూరు వాసులకు ప్రధానం రహదారిలో వంక ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు.
మద్యానికి డబ్బు ఇవ్వలేక భార్య ఆత్మహత్య
గోనెగండ్ల: మద్యం తాగాలని భర్త డబ్బు అడిగితే ఇవ్వలేక భార్య పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన గోనెగండ్లలోని కురువ పేటలో చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పెద్ద ఈరన్న, అంజినమ్మలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. ఈనెల 2వ తేదీ రాత్రి మద్యం తాగేందుకు ఈరన్న దగ్గర డబ్బులు లేకపోవడంతో భార్య అంజినమ్మను అడిగాడు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో అంజినమ్మ(40) భర్త ఎదుటనే పురుగుల మందు తాగింది. డబ్బాలో మిగిలిన పురుగుల మందును భర్త ఈరన్న తాగేశాడు. ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా భర్త ఈరన్న కోలుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం అంజినమ్మ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతురాలి తండ్రి శంకరప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పింఛన్లు ఎప్పుడిస్తారు?
● పత్తికొండ ఎమ్మెల్యేను నిలదీసిన
మహిళలు
కృష్ణగిరి: సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కోయిలకొండ గ్రామానికి వచ్చిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్‌ను మహిళలు నిలదీశారు. పింఛన్లు ఎప్పుడిస్తారు అని ప్రశ్నించారు. తమకు 60 ఏళ్లు నిండాయని ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదని గ్రామంలోని యశోద, లక్ష్మిదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌తో నష్టపోయామని వెంటనే న్యాయం చేయాలని బాధితులు కోరారు.

మహిళా జెడ్పీటీసీ సభ్యులకు 22 నుంచి శిక్షణ

మహిళా జెడ్పీటీసీ సభ్యులకు 22 నుంచి శిక్షణ