
కామేశ్వరీదేవికి సారె
మహానంది: మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు ఆదివారం పుట్టింటి పట్టుచీర, సారె సమర్పించారు. కోలాటాలు, భజనలతో మహానందికి వచ్చిన శోభాయాత్రకు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, అర్చకులు స్వాగతం పలికారు. ఈ మేరకు వారు ఆలయానికి చేరుకుని మహానందీశ్వరుడికి పట్టువస్త్రాలు, కామేశ్వరీదేవికి చీర, సారె అందజేశారు. మాడవీధుల్లో చేపట్టిన కోలాటాలు, భజనలు, నృత్యాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ట్రస్ట్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ధనుంజయరెడ్డి, అధ్యక్షుడు శ్రీకాంత్, ఆర్గనైజర్ శివమ్మ, సభ్యులు పాల్గొన్నారు.
చిన్నారిపై పిచ్చి కుక్కదాడి
పాములపాడు: బానుముక్కల గ్రామంలో గడ్డం జయమ్మ అనే ఏడేళ్ల చిన్నారిపై ఆదివారం పిచ్చి కుక్క దాడి చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై అందరూ చూస్తుండగానే దాడి చేసింది. కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న స్థానికులు పిచ్చికుక్కనే తరిమేశారు. గ్రామంలో పిచ్చి పట్టిన ఓ కుక్క సుమారు 20కి పైగా వీధి కుక్కలను కరిచిందని, అప్పటి నుంచి పిచ్చి కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.గాయపడిన చిన్నారిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.