
చదువుకు దూరమై.. పొలాల్లో కూలీలై..!
హొళగుంద: చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. కనీసం కస్తూర్బా పాఠశాలలో సీటు కూడా రాలేదు. పుస్తకాల సంచితో బడికి వెళాల్సిన వయస్సులో పొలాల్లో కూలీలుగా మారాల్సి వచ్చింది. వీరి దీన గాథ విని పలువురు అయ్యో‘పాప’ం అని అంటున్నారు. హొళగుంద మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన అడ్లిగి రాముడు, లక్ష్మి దంపతులు కుమార్తె పార్వతి, అలాగే ఉలిగప్ప, లక్ష్మి దంపతుల కుమార్తె సరస్వతి ఐదో తరగతి పూర్తి చేశారు. వీరికి సెంటు భూమి లేదు. పూరి గుడిసెలో నివాసం ఉంటూ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పార్వతి, సరస్వతి.. ఈ ఏడాది హొళగుంద కేజీబీవీలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి కారణం చెప్పకుండానే వీరికి సీటును కేటాయించలేదు. గ్రామానికి 5 కి.మీ దూరంలో ఉన్న హెబ్బటం ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు సరైన బస్సు సౌకర్యం లేక పార్వతి, సరస్వతి చదువుకు స్వస్తి చెప్పారు. తల్లిదండ్రులతో కలసి పత్తి పొలాల్లో పనులకు వెళ్తున్నారు. చదువుకోవాల్సిన చిన్నపిల్లలు దినసరి కూలీలుగా పొలంలో మగ్గుతుండడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆరవ తరగతికి సంబంధించి 40 సీట్లు భర్తీ అయ్యాయని పార్వతి, సరస్వతి అనే పిల్లల పేర్లు రాలేదని హొళగుంద కేజీబీవీ ఎస్‌ఓ దివ్య భారతి తెలిపారు.
చదువుకోవాలని ఉంది
నాతో చదివిన పిల్లలు చాలా మంది పట్టణాల్లో, హాస్టళ్లలో ఉంటూ ఆరవ తరగతిలో చేరారు. నాకు కూడా చదువుకోవాలని ఉంది. అయితే ఊర్లో ఆరవ తరగతి వరకు లేకపోవడంతో హెబ్బటంకు వెళ్లాలి. అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో మా అమ్మనాన్నతో పాటు పనికెళ్తున్నాను.
– పార్వతి
సీటు ఇప్పిస్తే బడికిపోతా
అమ్మనాన్నలు చదివిస్తే చదువుకుంటా. మా ఊర్లో ఐదు వరకు చదివి ఆరో తరగతి చదువుకోవడానికి హెబ్బటం పాఠశాలకు వెళ్లాలంటే దూరంగా ఉంది. అందుకే మా వాళ్లలతో కలిసి కూలీ పనులకు వెళ్తున్నా. సక్రమంగా బస్సులు లేవు. వసతులు లేవు. అధికారులు సహాయం చేసి సీటు ఇప్పిస్తే చదువుకుంటాం.
– సరస్వతి
లింగంపల్లి విద్యార్థినులకు
కేజీబీవీలో దక్కని సీటు

చదువుకు దూరమై.. పొలాల్లో కూలీలై..!

చదువుకు దూరమై.. పొలాల్లో కూలీలై..!