
బిరబిరా తుంగభద్ర
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి విడుదలైన నీరు మంగళవారం తెల్లవారుజామున హొళగుంద సెక్షన్ 184 కిలోమీటరుకు చేరుకుంది. కాలువకు నీరు రావడంతో గ్రామస్తులు పూజలు నిర్వహించారు. ప్రస్తుతం బసాపురం సెక్షన్‌లోని 230 కి.మీ వద్ద ఉన్న నీరు బుధవారం సాయంత్రం లేదా రాత్రికి బోర్డు సరిహద్దు 250 కి.మీ, హానవాళు సెక్షన్ దాటి ఆంధ్రలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే హొళగుంద సెక్షన్ పరిధిలోని కాలువలో దాదాపు 700 క్యూసెక్కుల నీటిమట్టానికి చేరుకుంది. కాగా ఈ ఏడాది టీబీ డ్యాంకు సంబంధించి 33 కొత్త క్రస్టు గేట్ల ఏర్పాటు నేపథ్యంలో ఎల్లెల్సీకి ఈ నెల 10 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఒక కారు పంటల (ఖరీఫ్) సాగుకు మాత్రమే నీరివ్వనున్నారు. బుధవారం తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో నిలకడగ ఉండడంతో 5 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 15,076 క్యూసెక్కులు నదికి, మరో 10 వేల క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు.