వైభవంగా శ్రీవారి రథోత్సవం
సి. బెళగల్: మండల పరిధిలోని క్రిష్ణదొడ్డి గ్రామంలో శ్రీ కోన వేంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు గూడూరు, కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూర్ మండలాల భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవానికి ముందు ఆలయ పూజార్లు గణపతి పూజ, పుణ్యహవాచనం, సంప్రోక్షణ గావించి అర్ధరాత్రి 12 గంటలకు కుంభంను ప్రారంభించారు. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు భక్తజనం మధ్య మహారథోత్సవం జరిగింది. తర్వాత పార్వేట నిర్వహించారు. శ్రీవారు, అమ్మవారి సమేత ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆశీనులు చేసి గ్రామంలో ఊరేగించారు.కాగా సోమవారం ఆది దంపతులకు వసంతోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


