రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు
● ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు
కర్నూలు(టౌన్): రైల్వేలో డబుల్ ట్రాక్ లైన్ పని చేయించేందుకు సూపర్‌వైజర్ ఉద్యోగమిస్తామని చెప్పి జొహరాపురానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి రూ.1.20 లక్షలు తీసుకుని మోసం చేశాడని కల్లూరు మండలం చెంచునగర్‌కు చెందిన పి.ప్రసాద్ ఎస్పీని కలసి వినతిపత్రం అందజేశారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నుంచి వచ్చిన పలువురు బాధితులు ఎస్పీని కలిసి వినతిపత్రాలు అందజేశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 125 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం పాల్గొన్నారు.
మరింత పడిపోయిన మిర్చి ధర
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మరింత పడిపోయాయి. మిర్చిలో తేజ, బ్యాడిగ, ఆర్మూర్ తదితర రకాల్లో ఏ ఒక్క రకం ధర రూ.10 వేలు దాటలేదు. ఎరుపు రకానికి గరిష్ట ధర రూ.9,999, బ్యాడిగ రకానికి రూ.9,411 వరకు ధర లభించింది. మిగిలిన రకాలకు ధరలు మరింత అధ్వానంగా లభించడం గమనార్హం. రెండు నెలల కిత్రం మిర్చి రైతులను ఆదుకుంటామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హంగామా చేశాయి. ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మిర్చితో పాటు వేరుశనగ, ఉల్లి, సజ్జలు, కందుల ధరలు మరింత పడిపోయాయి.


