జీవం పోసి.. జీవితం చాలించి!
కోసిగి: పేదరికం ఆమె పాలిట శాపంగా మారింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినా ఆమె బతకలేకపోయారు. కనీసం బిడ్డను చూడకుండానే మృతిచెందారు. ఈ దుర్ఘటన కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కోసిగి మండలం డి.బెళగల్ గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ (22)తో ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామానికి చెందిన హెబ్బటం రమేష్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. మెదటి కాన్పు నిమిత్తం ఆమె ఐదో నెల క్రితం పుట్టినిల్లు డి.బెళగల్ గ్రామానికి వెళ్లారు. తల్లిదండ్రులు పేదలు కావడంతో బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పుంటింట్లో ఆమె తోడుగా తమ్ముడు మాత్రమే ఉండేవారు. ఆమెకు సరైన పోషకాహారం అందేది కాదు. గర్భంతో ఉన్నా ప్రతి రోజూ ఆమె కూలి పనులకు వెళ్లేవారు. ఇటీవల జరిగిన ఉగాది పండుగకు తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున నాగేంద్రమ్మకు పురిటి నొప్పులు రావడంతో కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. సురక్షిత కాన్పు జరిగి మగ శిశువుకు ఆమె జన్మిచ్చింది. కాన్పు వెంటనే ఆమెకు ఫిట్స్ రావడంతో కోలుకోలేక మృతి చెందినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మనోజ్‌కుమార్ తెలిపారు. బిడ్డ ముఖం చూడకుండా తల్లి మృతిచెందడంలో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైయ్యారు. ఆమె మృతదేహాన్ని సంతెకుడ్లూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
పేదరికంతో గర్భిణికి అందని
పౌష్టికాహారం
బిడ్డకు జన్మనిచ్చి
తనువుచాలించిన మహిళ


