నేడు వాతావరణ కేంద్రం సందర్శనకు అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులోని బిర్లా కూడలిలో ఉన్న భారత వాతావరణ విభాగాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాల ప్రజలు గురువారం సందర్శించే అవకాశాన్ని కల్పించినట్లు వాతావరణ కేంద్రం అధికారి పి.ప్రభాకర్ తెలిపారు. భారత వాతావరణ విభాగం ఏర్పడి ఈ నెల 15 నాటికి సరిగ్గా 151 సంవత్సరాలు పూర్తవుతోందన్నారు. ఈ సందర్భంగా కర్నూలులోని వాతావరణ కేంద్రాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సందర్శించి ఇక్కడి యంత్రాలు, పరికరాలు, వాటి పని తీరును తెలుసుకోవచ్చన్నారు. వాతావరణ కేంద్రం వల్ల కలిగే ఉపయోగాలు, ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయనే విషయాలపై అవగాహన పెంచుకోవచ్చని ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పెరుగుతున్న పత్తి ధరలు
● కొనుగోలు కేంద్రాలకు తగ్గిన తాకిడి
కర్నూలు(అగ్రికల్చర్): బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు పత్తి తాకిడి తగ్గింది. జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడుల్లోని 16 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొంటోంది. ఈ నెల 12 నాటికి 24,649 మంది రైతుల నుంచి రూ.577.91 కోట్ల విలువైన 7,37,592.73 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. పత్తి మద్దతు ధర రూ.8,060. ఉమ్మడి జిల్లాలో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రమే పత్తి క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న ఆదోని మార్కెట్ యార్డులో క్వింటా పత్తికి కనిష్టంగా రూ.4,209, గరిష్టంగా రూ.8,778 లభించింది. సగటు ధర రూ.7,869 నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నెల రోజులుగా నగదు జమ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ నెల 23వ తేదీ వరకే స్లాట్స్ బుక్ అయ్యాయి. ఈనేపథ్యంలో స్లాట్ బుకింగ్‌ను బట్టి పత్తి కొనుగోళ్లు జరుగుతాయా, లేదా అన్నది స్పష్టమవుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై టీడీపీ నేత వీరంగం
నందవరం: మద్యం మత్తులో ఓ టీడీపీ నాయకుడు డ్యూటీలోని కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో బైక్‌పై వస్తూ పడిపోగా లేపబోయిన కానిస్టేబుల్‌పైనే నోరు పారేసుకున్నాడు. నీవెంత, నువ్వు తాగవా.. అంటూ మానవత్వం చూపిన పాపానికి బూతులు తిట్టాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు, నందవరం మండలంలోని నదికై రవాడి గ్రామానికి చెందిన కురవ వీరేష్ తెలంగాణలోని రాజపురంలో పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత బైక్‌పై నాగలదిన్నెకు బయలుదేరాడు. సరిహద్దు చెక్ పోస్టు వద్ద బైక్ నుంచి కింద పడిపోగా చెక్‌పోస్టు విధుల్లోని కానిస్టేబుల్ కె.రాజు మానవత్వంతో అతడిని లేపబోయా డు. ఇంతలోనే టీడీపీ నాయకుడు కొడకల్లారా.. నా ఇసుక ట్రాక్టర్లే ఆపుతారా అంటూ బూతులు మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వీరంగం సృష్టించాడు. ఇంతచేసినా ఇప్పటివరకు పోలీసులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.


