అనారోగ్యంతో సర్పంచ్ మృతి
తుగ్గలి : మండలంలోని రాతన గ్రామ సర్పంచ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గూడూరు రాచప్ప (80) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికి త్స అనంతరం నాలుగు రోజులకు క్రితం ఇంటికి వచ్చారు. తిరిగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొదట ఆదోనికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ కోలుకోలేక తుది శ్వాస విడిచారు. రాచప్ప మాస్టారు 2021లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుగా సర్పంచ్‌గా గెలిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు ఎస్.రామచంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మేధావుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు టీఎండీ హుసేన్, కో ఆప్షన్ సభ్యుడు చాంద్‌బాషా, ఇన్‌చార్జ్ సర్పంచ్ అన్వర్‌బాషా, సీ నియర్ నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, బసవరాజు,పంచాయతీ పాలకవర్గం నివాళులర్పించారు.
సెల్‌ఫోన్ అప్పగింత
వెల్దుర్తి: తనకు దొరికిన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్న యజమానికి పోలీసుల ద్వారా అప్పగించి ఓ యువకుడు తన నిజాయితీ చాటుకున్నాడు. పట్టణానికి చెందిన కర్రెక్కగారి లక్ష్మీకాంతరెడ్డి రోజులాగే తెల్లవారుజామున వంకగడ్డనున్న తన ఇంటి నుంచి రామళ్లకోట రోడ్డులో జాగింగ్‌కు వెళ్లాడు. నక్కల తిప్ప దాటిన తర్వాత రహదారి పక్కన సెల్‌ఫోన్ పడి ఉండటాన్ని చూసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఆ సెల్‌ఫోన్‌కు ఫోన్ కాల్ రావడం, లిఫ్ట్ చేయగా పోగొట్టుకున్న వ్యక్తి ఫోన్ చేయడాన్ని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఏఎస్‌ఐ ఆనందరెడ్డి విచారించి సెల్‌ఫోన్‌ను బొమ్మరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణకు అందజేశారు.


