పెద్దాసుపత్రిలో మంత్రి టీజీ అనుచరుల దౌర్జన్యం
అనుమతి లేకుండా జిరాక్స్ బంకు ఏర్పాటు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీ, పారిశుధ్య పోస్టుల విక్రయాల్లో చేతివాటం ప్రదర్శించడం తెలిసిందే. తాజాగా ఆసుపత్రి ఆవరణలో జిరాక్స్ సెంటర్ ఏర్పాటుకు కంటైనర్ దుకాణాన్ని రాత్రికి రాత్రి దించేశారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో మంత్రి అనుచరుడు ఒకరు దుకాణం ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే ఆసుపత్రిలో ఇలా బంకులకు అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్లడం సరికాదని ఆ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ పక్కన పెట్టేశారు. సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆసుపత్రిలోని ఓపీ టికెట్ కౌంటర్ సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో మంత్రి అనుచరుడుగా చెప్పుకునే ఓ వ్యక్తి కంటైనర్ బంక్‌ను తెచ్చి పెట్టేశారు. బుధవారం ఉదయం విష యం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి మాట్లాడారు. తాము వారిస్తున్నా వినిపించుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఇద్దరు సెక్యూరిటీ సూపర్‌వైజర్లను సస్పెండ్ చేశారు. అనంతరం బంక్ ఏర్పాటు చేసే సమయంలో ఎవరున్నారనే విషయమై సీసీ కెమెరా ఫుటేజ్‌ను తెప్పించుకున్నారు. ఓ ఉద్యోగ సంఘం నాయకుడు అక్కడున్న విషయం గుర్తించి మాట్లాడగా విషయం తెలుసుకునేందుకు వెళ్లామని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇలా పిలిపించి మాట్లాడటాన్ని అవమానంగా భావించిన ఓ నాయకుడు తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశా రు. ఇదిలాఉంటే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు నాయకులు ఆయనకు ఫోన్ చేసి తీవ్ర ఒత్తిళ్లకు గురిచేసినట్లు తెలిసింది. బంక్‌ను మంత్రి ఆదేశాల మేరకే వేశామని తొలగించవద్దని చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది బంకును తొలగిస్తుండగా మంత్రి అనుచరులు అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగడం గమనార్హం. ఎట్టకేలకు ఆసుపత్రి సిబ్బంది ప్రొక్లెయిన్ సాయంతో బంక్‌ను కంటి ఆసుపత్రికి వెళ్లే దారిలోకి తరలించారు.
హెచ్‌డీఎస్ మీటింగ్‌లో
కలెక్టర్ ఆదేశాలూ బేఖాతర్


