మూల్యాంకనం ప్రారంభం
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. నగర శివారులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. జిల్లాకు 1,93,747 సమాధాన పత్రాలు వివిధ జిల్లాల నుంచి వచ్చాయి. మూల్యాంకనం చేసేందుకు నియమించిన ఉపాధ్యాయులు మొదటి రోజున 89 చీఫ్ ఎగ్జామినర్లు, 537 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 145 మంది స్పెషల్ అసిస్టెంట్లు విధుల్లో చేరారు. వారిని సర్దుబాటు చేసే ప్రక్రియ కొంత ఆలస్యమైంది. క్యాంపు ఆఫీసర్‌గా వ్యవహారించిన డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ ముందుగా విధుల్లో చేరిన వారితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ప్రతి రోజు ఎన్ని పేపర్లు మూల్యాంకనం చేయాలో కచ్చితంగా నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలన్నారు. ఆ తరువాత మొదలైన స్పాట్‌లో మొదటి రోజు సోషల్, ఒకేషనల్ మినహా 11,081 వేల పేపర్లను మూల్యాంకనం చేశారు. అదే విధంగా ఓపెన్ టెన్త్ పేపర్లు 16,220 సమాధాన పత్రాలు జిల్లాకు రాగా, మూల్యాంకనం చేసేందుకు 15 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 82 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను నియమించగా, మొదట రోజున 1,275 పేపర్లను మూల్యాంకనం చేశారు.
రేపు శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం ఈనెల 5న రోజున శ్రీశైల మహా క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు లాగి అనంతరం తిరిగి యథాస్థానానికి చేర్చనున్నట్లు తెలిపారు.
రెండు రేషన్ షాపులపై
6ఏ కేసులు
కర్నూలు(సెంట్రల్): ఉండాల్సిన దాని కంటే త క్కువగా బియ్యం ఉన్న మరో రెండు రేషన్ షాపులపై పౌరసరఫరాల ఽఅధికారులు 6ఏ కేసులు నమోదు చేశారు. గురువారం నగరంలోని 53వ నంబరు రేషన్ షాపులో డీఎస్‌ఓ రాజారఘువీర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 3290 కేజీల బియ్యం, 604 కేజీల జొన్నలు తక్కువగా ఉన్నాయి. అలాగే రేషన్ షాపు నంబర్ 162లో 1800 కేజీల బియ్యం, 286 ప్యాకెట్ల చక్కెర ఉండడంతో యాజమాని రవిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో ఏఎస్‌ఓ రామాంజనేయరెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.


