వడదెబ్బతో యాచకుడి మృతి
కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని యాచకుడు గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. 60 సంవత్సరాలకు పైబడిన ఓ గుర్తు తెలియని యాచకుడు కొన్ని రోజుల క్రితం భిక్షాటనకు కోవెలకుంట్లకు వచ్చాడు. ప్రతి రోజు పట్టణంలో భిక్షాటన చేసుకుని రాత్రి సమయాల్లో బస్టాండ్ పరిసరాల్లో నిద్రించేవాడు. రోజులాగే గురువారం ఉదయం భిక్షాటన నిమిత్తం వెళ్లి ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యాడు. అనారోగ్యంతోనే బస్టాండ్ వద్దకు చేరుకుని కుప్పకూలిపోయి మృతి చెందాడు. ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని యాచకుడి చిరునామా వివరాలు ఆరా తీశారు. వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


