సుభిక్షం కాదు.. అంతటా సం‘క్షోభ’మే!
● నేటితో 2024–25 ఆర్థిక
సంవత్సరానికి ముగింపు
● సంక్షేమ పథకాలకు పాతరేసిన
కూటమి ప్రభుత్వం
● ప్రతి పేద కుటుంబానికి
రూ.75 వేల వరకు నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షోభమే మిగిలింది. ఎన్నికల సమయంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చాలా వరకు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆర్థిక సంవత్సరం సోమవారంతో ముగియనుంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. పది నెలల కాలంలో పేదరిక నిర్మూలన కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయినా టీడీపీ అనుకూల పత్రికలు మాత్రం పది నెలల్లోనే రాష్ట్రం సుభిక్షంగా మారినట్లు కథనాలు రాస్తున్నాయి. ఈ విషయమై ఎవరిని కదిలించినా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కనిపించని సంక్షేమ పథకాలు..
● ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలు ఉంటే ప్రతి ఒక్కరికి నెలకు రూ.1,500 ప్రకారం ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 చెల్లిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వీటి గురించి మరచిపోయారు.
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు సగటున ఏడాది రూ.75 వేల వరకు ఆర్థిక లబ్ధి చేకూరింది. ఒక్కో కుటుంబానికి మూడు నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అందాయి. ఎన్నికల సమయంలో సూపర్–6 తో పాటు ఎన్నో హామీలను టీడీపీ నేతలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో పేదలు ఏడాదికి సగటున రూ.75 వేల వరకు నష్టపోయారు.
● నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,000 ప్రకారం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనికి 2025–26లో బడ్టెట్ కేటాయింపులు లేవు.
● మహిళలకు ఉచిత బస్సు హామీ కూడా కొండెక్కింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు బడ్జెట్‌లో అరకొరగానే కేటాయింపులు ఉన్నాయి.
● 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామంటూ ప్రకటించిన హామీ అమలు కాలేదు.
● ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు రూ.10 లక్షలకు, సహజ మరణాలకు రూ.5 లక్షలకు బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు, సాధారణ మరణాలు 1500 వరకు ఉన్నాయి. వీరికి ఎలాంటి చేయూత లేకండా పోయింది.
● స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు హమీ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 25 వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.1000 కోట్ల వరకు లింకేజీ రుణాలు పొందారు. సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో వారిపై వడ్డీ భారం పడుతోంది.
మోసం చేశారు
అన్ని వర్గాల ప్రజలను నమ్మించి టీడీపీ ఆధినేత చంద్రబాబు మోసం చేశారు. సంక్షేమ పథకాల అమలును పట్టించుకోకపోవడం లేదు. రైతులకు కూటమి ప్రభుత్వం ఇసుమంత కూడా చేయూత ఇవ్వలేదు. మహిళల సంక్షేమాన్ని పక్కన పెట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనైనా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెడుతారా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. బడ్జెట్‌లో అసలు కేటాయింపులే లేవు. – నారాయణ నాయక్,
రైతు, జాప్లాతండా, తుగ్గలి మండలం
64 మంది రైతుల బలవన్మరణాలు
గత ఏడాది జూన్ నెలలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి జిల్లాలో 64 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో 42, నంద్యాల జిల్లాలో 22 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2024–25లో వ్యవసాయం కలసి రాలేదు. పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న తదితర పంటల్లో దిగుబడులు పడిపోయాయి. అంతంతమాత్రం వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.
సుభిక్షం కాదు.. అంతటా సం‘క్షోభ’మే!


