మహానంది: ‘మట్టిని తరలించి సొమ్ము చేసుకుందాం, ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోకపోతే మళ్లీ ఎప్పుడు చెప్పు.. కాదు, కూడదని ఎవడైనా అడ్డొస్తే బండి (టిప్పర్)తో తొక్కిస్తా. అందరూ తలా ఇంతా సంపాదించుకుందాం.. నీకు అర్ధ రూపాయా, నాకు అర్ధ రూపాయి, పై వాళ్లకు ఇంత ఇద్దాం’ మట్టి తవ్వకాలపై ఇద్దరు టీడీపీ నేతలు ఫోన్‌లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం చివరకు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ‘తలా ఓ రూపాయి తీసుకుందాం’ అంటూ ఫోన్‌లో ఏకంగా నియోజకవర్గ నేతల పేర్లతో సహా చర్చించుకోవడం విశేషం. మహానంది మండలం గోపవరం గ్రామంలో బైరవాణి చెరువు ఉంది. ఇటీవల ఈ చెరువు నుంచి పొలాలు, ప్లాట్లకు తరలించే మట్టితో పాటు ఇటుకలకు వినియోగించే ఎర్రమట్టి ఎక్కువగా ఉంది. అధికారంలో ఉన్నాం.. మనల్ని అడిగేదెవరూ అను కుని ఇటీవల కొద్దిరోజుల క్రితం మట్టి తరలింపుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకోవడంతో మట్టి తరలింపు ఆగిపోయింది. అయితే ఇదే చెరువులోని మట్టి తరలింపుపై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకున్నారు. పార్టీలోని రెండు వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు క్రాంతికుమార్ యాదవ్, శ్రీనివాసులు ఫోన్‌లో మాట్లాడుకున్న సంభాషణ బయటికి రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వారి మాటల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నియోజకవర్గ నేత బన్నూరు రామలింగారెడ్డిల పేర్లు సైతం రావడంతో ఆ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అందరం తలా ఇంత పంచుకుందాం
టైం ఉన్నప్పుడే నాలుగు డబ్బులు
సంపాదించుకుందాం
పది బండ్లు పెట్టుకుని కూర్చుందాం
ఎవరైనా ఆపితే టిప్పర్‌తోనే కొడతా!
మట్టి తవ్వకాలపై టీడీపీ నేతల
ఫోన్ సంభాషణ వైరల్


