ప్రబలుతున్న అతిసారం
అతిసార వ్యాధి విజృంభిస్తోంది. కడుపునొప్పి, విరేచనాలు తదితర లక్షణాలతో వైద్యుల వద్దకు క్యూ కట్టే జనం రోజురోజుకు ఎక్కువవుతున్నారు. వర్షాకాలం కావడంతో తాగునీరు కలుషితం కావడం, ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం కూడా కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. అక్కడక్కడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు.
●అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు
అతిసారం /డయేరియా ప్రబలకుండా సంబంధిత శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఐసీడీఎస్‌లతో మా మెడికల్ ఆఫీసర్లతో ఇటీవల జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చర్చించాం. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకున్నాం. అతిసార వ్యాధికి గురైన వారికి చికిత్స అందించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పంచాయతీ సిబ్బంది ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా నీటి ట్యాంకులు శుభ్రం చేసేలా చర్యలు చేపట్టాం. ఐసీడీఎస్ వారితో గర్భిణులు, పిల్లలకు వండే ఆహారాన్ని పరిశుభ్రమైన పరిస్థితుల్లో వండాలని, పిల్లలు చేతులను శుభ్రంగా కడుక్కుని తినాలని సూచిస్తున్నాం. సున్నా నుంచి ఆరు నెలల పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాం. పిల్లలకు అతిసారం రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఇంటికీ జింక్ మాత్రలు, సిరప్‌లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేసి విరేచనాలు వస్తే అవి వాడే విధానాన్ని మా సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నాం. – డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ, కర్నూలు
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిసార వ్యాధి విజృంభిస్తోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతిచోటా అతిసార వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కడుపునొప్పి, విరేచనాలు తదితర లక్షణాలతో వైద్యుల వద్దకు క్యూకడుతున్నారు. ఇలాంటి వారికి గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో, పీహెచ్‌సీల్లో మెట్రోనిడజోల్‌తో పాటు విరేచనాలు తగ్గేందుకు మాత్రలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. పట్టణాల్లోని ప్రైవేటు వైద్యులైతే విరేచనాలు తగ్గేందుకు ఆధునిక మందులతో పాటు ఖరీదైన యాంటీబయాటిక్ మందులను ఇస్తున్నారు. ఎవరు ఎలాంటి మాత్రలు ఇచ్చినా నాలుగైదు రోజుల్లో విరేచనాలు సర్దుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జూపాడుబంగ్లాలోని బన్నూరు, ఆదోని మండలంలోని ఇస్వి, హొళగుంద మండలం నెరణికి తండాలో అతిసార వ్యాధి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆయా గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెళ్లి వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేయడమే గాక నివారణ చర్యలు సూచించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకరిద్దరు కడుపునొప్పి, విరేచనాలతో వైద్యుల వద్దకు వెళ్తున్నారు.
తాగునీరు కలుషితం కావడం వల్లే..
పట్టణాలు, గ్రామాల్లోని తాగునీటి పైపులైన్లు ఎక్కువగా మురికినీరు ప్రవహించే కాలువల్లో లేదా వాటి పక్కన వెళ్తుంటాయి. ఇవి ఎక్కడో ఒకచోట లీకేజీ అయినా ఉద్యోగులు గుర్తించని పరిస్థితి. ఈ క్రమంలో ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మురికి కాలువలు నిండి పారుతున్నాయి. దీంతో పైపులైన్లలోని తాగునీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగిన ప్రజలు కడుపునొప్పి, విరేచనాలకు గురవుతున్నారు. ఇవి నివారించాలంటే ఈ సీజన్‌లో ప్రజలు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికితోడు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి పైపులైన్‌లు లీకేజీలు గుర్తించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. మరోవైపు పంచాయతీ సిబ్బంది పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో ఇది జరగడం లేదు. మురికికూపాలపై కూర్చున్న ఈగలు సైతం ఆహార పదార్థాలపై వాలడం వల్ల సదరు ఆహారం తిన్న వారికి సైతం కడుపునొప్పి, విరేచనాలు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అతిసార వ్యాధి అంటే..
లూజు లేదా నీళ్ల బేదులనే అతిసార వ్యాధిగా పిలుస్తారు. ఒక వ్యక్తి ఒక రోజులో మూడు లేదా అంతకుమించిన సార్లు లూజు లేదా నీళ్ల బేదులు చేసుకుంటే డయేరియాగా గుర్తిస్తారు. వైరస్, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఈ వ్యాధి కలుషితమైన నీటిని తాగడం, ఆహారాన్ని తినడం వల్ల వస్తుంది. అతిసార వ్యాధి వల్ల శరీరంలోని లవణాలు కోల్పోయి మనిషిని నిస్సత్తువ ఆవరిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే కొన్నిసార్లు ఇది ప్రాణాపాయానికి దారి తీస్తుంది.
వ్యాధి లక్షణాలు
పొత్తికడుపు పిండేసినట్లు ఉండటం, కడుపునొప్పి, పొత్తికడుపు ఉబ్బటం, దప్పిక ఎక్కువ, బరువు తగ్గటం, జ్వరం, కడుపులో వికారం, ఆకస్మికంగా మలవిసర్జనకు వెళ్లాలనే ఆతృత, లూజు బేదులతో పాటు ఇతర తీవ్రమైన లక్షణాలతో కలిసి కూడా రావచ్చు. మలంలో రక్తం పడటం, ఎడతెగని వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. రెండు రోజులకు మించి ఎక్కువగా బేదులు వస్తుంటే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
చికిత్స
సాధారణ మందులతో విరేచనాలు నయమవుతాయి. అతిసార వ్యాధితో పాటు జ్వరం ఉంటే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. చిన్నపిల్లల్లో అతిసార వ్యాధికి చిన్నపిల్లల వైద్యులను కలిసి చికిత్స అందుకోవాలి. కొన్నిరకాల బ్యాక్టీరియా సహిత అతిసార వ్యాధికి యాంటీబయాటిక్ మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. వీటితో పాటు క్రోన్, అల్సెరేటివ్ కొలైటిస్, ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్ వల్ల వచ్చే అతిసార వ్యాధికి వైద్యులు నిర్దిష్టమైన మందులు సూచిస్తారు.
తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు
●జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అతిసార వ్యాధిని త్వరగా పరిష్కరించవచ్చు. భవిష్యత్‌లో రాకుండా నివారించుకోవచ్చు. –బాత్‌రూమ్‌ను ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి.
●వంటచేసే ముందు, వంట చేసిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి. డైపర్స్ మార్చిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.
●మరిగించిన లేక బాటిల్‌లోని ప్యూరిఫైడ్ నీటిని తాగాలి.
●వేడిగా ఉన్న పానియాలను తాగాలి.
●శిశువులకు, చిన్నపిల్లలకు వయస్సుకు తగిన ఆహారాన్ని ఇవ్వాలి.
●ఆరు నెలల వరకు తల్లిపాలను తప్పనిసరిగా ఇవ్వాలి.
●ఆహారాన్ని సక్రమంగా నిల్వ చేయాలి.
గ్రామాల్లో పెరుగుతున్న కేసులు
డాక్టర్ల వద్దకు క్యూ కడుతున్న రోగులు
జూపాడుబంగ్లా, ఇస్వి, నెరణికి తండాల్లో కేసుల నిర్ధారణ
ఆహారం, తాగునీరు కలుషితం కావడమే కారణమంటున్న వైద్యులు
ప్రత్యేక వైద్యశిబిరాలతో వైద్యసేవలు
వీటికి దూరంగా ఉండాలి
శుద్ధిచేయని నీటిని తాగరాదు.
శుద్ధి చేయని నీటితో తయారైన జూ్‌య్‌స్‌లు, పానీయాలు, ఐస్‌లకు దూరంగా ఉండాలి.
అన్‌పాస్చురైజ్డ్ పాలు తాగకూడదు.
రోడ్డు పక్కన ఉండే ఆహారాన్ని తినకూడదు.
పచ్చివి, వండని ఆహారాన్ని, మాంసాన్ని తినకూడదు.
ఆల్కహాలు, పానీయాలకు దూరంగా ఉండాలి.
మసాల పదార్థాలు తగ్గించాలి.
కాఫీ, టీలు పరిమితం చేయాలి
ప్రబలుతున్న అతిసారం


