పల్లెపోరుకు సై | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరుకు సై

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

పల్లెపోరుకు సై

ఉయ్యూరు డివిజన్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం 125 సర్పంచ్‌ స్థానాలకు 315 మంది అభ్యర్థులు 988 వార్డు స్థానాలకు 2,070 మంది పోటీ 1,460 పోలింగ్‌ కేంద్రాలు.. 2,85,345 మంది ఓటర్లు

ఎన్నికల విధులకు గైర్హాజరైన 9మంది పీఓ, ఏపీఓలపై సస్పెన్షన్‌ వేటు

చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో ఆదివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

125 సర్పంచ్‌ స్థానాలకు పోటీ

ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, పమిడిముక్కల, పెదపారుపూడి మండలాల్లోని 142 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 17 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 125 స్థానాలకు 315 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,408 వార్డు సభ్యుల స్థానాలకు గానూ 419 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 988 స్థానాలకు 2,070 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొవ్వపాలెం పంచాయతీలోని 2వ వార్డుకు మాత్రం ఎవరూ నామినేషన్‌ వేయలేదు. ఎన్నికల నిర్వహణ కోసం 1,460 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,85,345 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,37,004 మంది పురుషులు, 1,48,338 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు ఉన్నారు.

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్‌ డీకే బాలాజీ శనివారం పరిశీలించారు. మొవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రు వ్యవసాయ మార్కెట్‌ యార్డు, పమిడిముక్కల, తోట్లవల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికల సిబ్బంది నియామకం

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ సిబ్బంది, పోలీస్‌ బందోబస్తుకు సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ ప్రక్రియకు పీవోలు, ఏపీవోలుగా 4,590 మందిని నియమించారు.

ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు సిబ్బందిని నియమించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు సంబంధిత ఎన్నికల అధికారులు తెలిపారు.

పమిడిముక్కల: రెండో విడత పంచాయితీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 9 మంది పీఓలు, ఏపీఓలపై కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ సస్పెన్షన్‌ వేటు వేశారు. పమిడిముక్కల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ సందర్శించారు. సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించి, ఎన్నికల సిబ్బంది హాజరు వివరాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ నేపథ్యంలో 9 మంది పీఓ, ఏపీఓలు ఎన్నికల విధులకు గైర్హాజరైనట్లు గుర్తించిన కలెక్టర్‌ వారి పేర్లతో జాబితా సిద్ధం చేయించి అప్పుటికప్పుడు సస్పెన్షన్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు. సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవడంతో పాటు, తదుపరి విచారణకు కూడా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీర్ల సీతా రామరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement